3D Printing: రివియన్, ఫోర్డ్ కొత్త వ్యూహం.. కార్ల తయారీలో 3D ప్రింటింగ్ విప్లవం!
ఈ వార్తాకథనం ఏంటి
ఒక కారు తయారీ ప్లాంట్‌లో చిన్న విడిభాగం అవసరమైందనుకోండి. సాధారణంగా దాన్ని సరఫరాదారు నుంచి తెప్పించుకోవాలి. దానికి కొన్ని రోజులు పట్టొచ్చు. కానీ అదే భాగాన్ని ఫ్యాక్టరీలోనే 3D ప్రింటర్‌తో తయారు చేసుకుంటే? సమయం ఆదా అవుతుంది.. ఖర్చూ తగ్గుతుంది. ఇప్పుడు రివియన్, ఫోర్డ్ వంటి ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఇదే ఆలోచనతో 3D ప్రింటింగ్ టెక్నాలజీని తమ తయారీ ప్రక్రియలో విస్తరిస్తున్నాయి.
Details
వారాల పని.. గంటల్లోనే పూర్తి!
3D ప్రింటింగ్ అంటే కంప్యూటర్లో రూపొందించిన డిజైన్ ఆధారంగా ప్లాస్టిక్, లోహాలు, సిరామిక్స్ వంటి పదార్థాలను పొరల వారీగా జోడిస్తూ ఒక వస్తువును తయారు చేయడం.
దీనిని యాడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ అని కూడా పిలుస్తారు. చిన్న విడిభాగాల నుంచి పనిముట్ల వరకు అవసరానికి తగినట్లు తయారు చేసుకోవచ్చు.
సంప్రదాయ పద్ధతుల్లో కొన్ని భాగాలు రావడానికి వారాలు పట్టినా, 3D ప్రింటింగ్‌తో గంటలు లేదా రోజుల్లోనే సిద్ధం చేయవచ్చని కంపెనీలు చెబుతున్నాయి.
Details
రివియన్ పెట్టుబడి రూ. కోట్లలో..
రివియన్ ఇప్పటికే 3D ప్రింటింగ్ యంత్రాల కోసం 5 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది.
వీటి నిర్వహణకు అవసరమైన పదార్థాలపై ఏడాదికి సుమారు 1.7 మిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. అయినప్పటికీ, సాధారణంగా ఏడాదిలోపే ఈ యంత్రాలపై పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని కంపెనీ ప్రతినిధి జారెడ్ బెక్ తెలిపారు.
సరఫరాదారులపై ఆధారపడటం తగ్గడంతో పాటు రవాణా, పనిముట్ల తయారీ ఖర్చులు కూడా తగ్గుతున్నాయని వివరించారు.
Details
ఫోర్డ్ ఫ్యాక్టరీల్లోనే విడిభాగాల తయారీ
ఫోర్డ్ కూడా ఈ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తోంది. డియర్బార్న్లోని ఎఫ్-150 పికప్ ట్రక్కుల తయారీ కేంద్రం సమీపంలో 3D ప్రింటింగ్‌తో తయారైన భాగాలను అందించే వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది.
ఉద్యోగులు యాప్ ద్వారా అవసరమైన పనిముట్లు, విడిభాగాలను ఆర్డర్ చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ అధికారిక 3D ప్రింటింగ్ కార్యక్రమంలో 200కు పైగా యంత్రాలు ఉన్నాయి.
ఈ ఏడాది చివరి నాటికి 23కు పైగా ప్లాంట్లలో 3D ప్రింటింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Details
జీఎం కార్లలోనూ ప్రత్యేక భాగాలు
జనరల్ మోటార్స్ (జీఎం) కూడా ఈ టెక్నాలజీని పరిశోధన, అభివృద్ధి, తయారీ విభాగాల్లో ఉపయోగిస్తోంది. ప్రత్యేకంగా తయారయ్యే క్యాడిలాక్ సెలెస్టిక్ కారులోనే 3D ప్రింటింగ్‌తో రూపొందించిన 135 విడిభాగాలను వినియోగిస్తోంది.
అయితే, 3D ప్రింటింగ్ సంప్రదాయ తయారీ విధానాలకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదు. అత్యవసర సమయాల్లో ప్లాంట్ల పనులు ఆగకుండా కొనసాగించడానికి, ప్రత్యేక డిజైన్లను వేగంగా తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతోంది.
భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తే కార్ల తయారీలో ఖర్చులు, సమయం రెండింటిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.