Kia Discounts April : కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. కియా నుంచి భారీ ఆఫర్లు
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త కారు కొనాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల వాహన ప్రియులకు కియా ఇండియా శుభవార్త అందించింది. ఏప్రిల్ 2026 నెలకు గాను తన ప్రముఖ ఎస్‌యూవీ, ఎంపీవీ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. నగదు తగ్గింపులు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో ఈ లాభాలు లభించనున్నాయి. ముఖ్యంగా పాత స్టాక్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.
వివరాలు
కియా కార్నివాల్‌పై భారీ తగ్గింపులు
కియా లైనప్‌లో అత్యంత లగ్జరీ మోడల్‌గా గుర్తింపు పొందిన 'కార్నివాల్'పై ఈ నెలలో గరిష్ట డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 2025 మోడల్ యూనిట్లపై మొత్తం రూ.3.20 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. ఇందులో రూ.50,000 నగదు తగ్గింపు, పాత కారు ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.2,00,000 బోనస్, అలాగే రూ.50,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే 2026 మోడల్ (ఎంవై26) కార్నివాల్‌పై మాత్రం కేవలం రూ.1 లక్ష వరకు మాత్రమే ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
సెల్టోస్‌పై కూడా ఆకర్షణీయ ఆఫర్లు
మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రముఖ స్థానంలో ఉన్న 'సెల్టోస్'పై కూడా కంపెనీ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. 2025 మోడల్‌పై మొత్తం రూ.1.35 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ.40,000 నగదు తగ్గింపు, రూ.60,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.20,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్ ఉన్నాయి. క్రెటా వంటి పోటీ మోడళ్లకు పోటీగా సెల్టోస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ ఆఫర్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
సైరోస్, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక డీల్స్
కియా నుంచి కొత్తగా వచ్చిన 'సైరోస్' ఎస్‌యూవీ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై కూడా మంచి తగ్గింపులు ఉన్నాయి. 2025 మోడల్‌పై రూ.1.55 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి ఉన్నవారికి 'క్యారెన్స్ క్లావిస్ ఈవీ'పై కూడా ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. క్యారెన్స్ క్లావిస్ ఈవీ హెచ్‌టీఎం వేరియంట్ (2025 స్టాక్)పై రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపేవారికి ఇది సరైన సమయంగా భావిస్తున్నారు. ఈ ఆఫర్లు డీలర్‌షిప్, స్టాక్ లభ్యతపై ఆధారపడి మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పూర్తి వివరాల కోసం సమీప కియా షోరూమ్‌ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.