Hero Vida VX2: రూ.44,990కే హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. విడా VX2 మార్కెట్లోకి ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చుల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా కింద కొత్తగా హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచిన ఈ మోడల్ ప్రారంభ ధరను రూ.44,990గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ రెంటల్ మోడల్ కావడం విశేషం. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ధర మొత్తం వాహన ధరలో దాదాపు సగం వరకు ఉంటుంది.
వివరాలు
రెండు వేరియంట్లలో అందుబాటులో
అయితే విడా VX2లో వినియోగదారులు బ్యాటరీని అద్దె ప్రాతిపదికన వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో స్కూటర్ కొనుగోలు ధర గణనీయంగా తగ్గింది. వినియోగదారులు తమ ప్రయాణ దూరాన్ని బట్టి కిలోమీటరుకు రూ.0.90 నుంచి రూ.1.47 వరకు బ్యాటరీ వినియోగ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 92 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక 3.4 kWh బ్యాటరీ వేరియంట్‌లో గరిష్టంగా 100 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
వివరాలు
మరింత అధునాతన ఫీచర్లు
రిమూవబుల్ బ్యాటరీ టెక్నాలజీ అందుబాటులో ఉండటంతో ఇంట్లోని సాధారణ 3-పిన్ సాకెట్ ద్వారానే సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫీచర్ల పరంగా కూడా హీరో విడా VX2 ఆకట్టుకునే విధంగా రూపొందించారు. ఇందులో 4.3 అంగుళాల డిజిటల్ LCD డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు అందించారు. అదనంగా జియో ఫెన్సింగ్, లైవ్ ట్రాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి భద్రతా సదుపాయాలను కూడా కల్పించారు. మార్కెట్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, అథర్ రిజ్టా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.