Honda City Facelift : స్పోర్టీ లుక్‌తో రానున్న హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. లాంచ్‌కు ముందే లీకైన మోడల్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్లో ప్రీమియం మిడ్‌సైజ్ సెడాన్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలపర్చుకునేందుకు హోండా కార్స్ ఇండియా సిద్ధమవుతోంది. కంపెనీ తన ప్రముఖ సెడాన్ హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మే 22న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అధికారిక ఆవిష్కరణకు ముందే ఈ కొత్త మోడల్ డీలర్‌షిప్‌ల వద్ద కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన స్పై చిత్రాల ద్వారా హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఫీచర్లలో పలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఐదో తరం హోండా సిటీకి తొలి ప్రధాన అప్‌డేట్‌గా భావిస్తున్నారు.
వివరాలు
కొత్త డిజైన్‌తో ఆకట్టుకోనున్న హోండా సిటీ
ఫేస్‌లిఫ్ట్ మోడల్ ముందు భాగంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, పైభాగంలో అమర్చిన ఇంటిగ్రేటెడ్ DRLsప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ DRLsను స్లిమ్ లైట్ బార్ ద్వారా రివైజ్డ్ గ్రిల్‌తో అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కారుకు మరింత ఆధునిక లుక్ వచ్చింది. అదే సమయంలో గ్రిల్ డిజైన్‌ను మరింత షార్ప్‌గా తీర్చిదిద్దగా, బంపర్‌ను పూర్తిగా కొత్త స్పోర్టీ స్టైల్‌లో రూపొందించారు. అయితే స్పై షాట్స్‌లో కనిపించిన టెస్ట్ కారులో ఫాగ్ ల్యాంప్స్ లేకపోవడం గమనార్హం. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న మోడల్ తరహానే కొనసాగించినప్పటికీ, కొత్త బ్లాక్ ఫినిష్డ్ అలాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ టచ్‌ను అందిస్తున్నాయి. వీల్ సైజ్ 16అంగుళాలుగానే ఉండే అవకాశం ఉంది.
వివరాలు
రియర్ డిజైన్‌లోనూ మార్పులు
మొదటిసారి బయటపడిన రియర్ డిజైన్‌లో టెయిల్ ల్యాంప్‌ల ఆకారం ప్రస్తుతం ఉన్న మోడల్‌లానే కనిపించినా, వాటికి స్మోక్డ్ ఫినిష్ ఇచ్చే అవకాశముంది. రియర్ బంపర్‌ను కూడా క్లీనర్, స్పోర్టియర్ డిజైన్‌తో తీర్చిదిద్దారు. పాత C-షేప్ స్టైలింగ్‌ను తొలగించి మరింత ఆధునిక రూపాన్ని ఇచ్చారు. బూట్ లిడ్‌పై పెద్ద ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కూడా కనిపిస్తోంది.
వివరాలు
ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు
క్యాబిన్‌లో ప్రస్తుతం ఉన్న 8 అంగుళాల యూనిట్ స్థానంలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను అందించే అవకాశం ఉంది. కొత్త డిస్‌ప్లే మరింత అప్‌రైట్ లేఅవుట్‌తో ఉండొచ్చని స్పై చిత్రాలు సూచిస్తున్నాయి. అలాగే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. బ్లాక్-బేజ్ డ్యాష్‌బోర్డ్ థీమ్, బేజ్ సీటు అప్‌హోల్స్టరీ, అంబియంట్ లైటింగ్, ప్రస్తుత స్టీరింగ్ వీల్ డిజైన్ వంటి అంశాలను యథాతథంగా కొనసాగించే అవకాశముంది.
వివరాలు
ఇంజిన్‌లో మార్పుల్లేవు
మెకానికల్‌గా కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు లభించనున్నాయి. అదేవిధంగా అత్యుత్తమ మైలేజ్‌కు పేరుగాంచిన సిటీ e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా హోండా కొనసాగించే అవకాశముందని సమాచారం.