Karun Chandhok: భారత్‌లో మళ్లీ ఫార్ములా-1 రేసులు జరగాలంటే ఇవే కీలకం: కరుణ్ చందోక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఫార్ములా 1 రేసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బహ్రెయిన్, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ రద్దు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ భారత అభిమానుల్లో మాత్రం ఎఫ్1 మళ్లీ భారత్‌కు వస్తుందా అనే చర్చలు కొనసాగుతున్నాయి. దాదాపు 13 ఏళ్ల క్రితం చివరిసారిగా భారత్‌లో ఎఫ్1 రేసు జరిగింది. ఇదే సమయంలో ఆదానీ గ్రూప్‌కు చెందిన కరణ్ ఆదానీ ఈ ప్రయత్నంలో పాల్గొంటున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో ఇండియన్ గ్రాండ్ ప్రీ పునరుద్ధరణపై ఆశలు పెరిగాయి. జైపీ గ్రూప్ నిర్మించిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌కు సంబంధించి జరుగుతున్న మార్పులు కూడా ఈ ప్రణాళికకు అనుకూలంగా ఉన్నాయి.
వివరాలు
రేసును నిర్వహించేందుకు కావాల్సిన ఖర్చును ఎవరు భరిస్తారు?
ఇదిలా ఉండగా, మాజీ భారత ఎఫ్1 డ్రైవర్ కరుణ్ చందోక్ తాజాగా ఓ వీడియో ద్వారా భారత్‌లో ఫార్ములా-1 తిరిగి రావాలంటే ఏమి చేయాలో వివరించారు. ముందుగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనుమతులు, చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పారు. ముఖ్యంగా లాజిస్టిక్స్, వీసా అనుమతులు, ఇతర ప్రక్రియలు సులభంగా ఉండాలని సూచించారు. అదే విధంగా రేసును నిర్వహించేందుకు కావాల్సిన ఖర్చును ఎవరు భరిస్తారు అనే అంశంపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. యజమాని, ప్రమోటర్, ప్రభుత్వం లేదా సంయుక్తంగా ఈ బాధ్యతను తీసుకుంటారా అన్నది నిర్ణయించాలి అని అన్నారు. అలాగే టికెట్ ధరలు, నిర్వహణ వ్యయం వంటి అంశాలను ముందుగానే నిర్ణయిస్తే దీర్ఘకాలికంగా ఎఫ్1 నిర్వహణ సాధ్యమవుతుందని చెప్పారు.
వివరాలు
ఎఫ్1 క్యాలెండర్‌లో స్థానం దక్కించుకోవడం ముఖ్యం
మరో కీలక అంశంగా మౌలిక వసతుల అభివృద్ధిని ప్రస్తావించారు. బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ప్రస్తుతం మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ, అతిథ్య సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, ఇతర సౌకర్యాల్లో మెరుగుదల అవసరమని వివరించారు. చివరిగా ఎఫ్1 క్యాలెండర్‌లో స్థానం దక్కించుకోవడం కూడా ముఖ్యమని చెప్పారు. ఇప్పటికే ఏడాదికి 24 రేసులు జరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో మళ్లీ గ్రాండ్ ప్రీ నిర్వహణకు కొంత సమయం పట్టవచ్చని, 2029-2030 మధ్యలో ఇది సాధ్యమవుతుందని అంచనా వేశారు. అయితే ముందు చెప్పిన అన్ని అంశాలను సరిచేస్తేనే భారత్‌లో ఎఫ్1 తిరిగి రావడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.