Loading...
Kia Carnival Hybrid: కియా కార్నివాల్‌ హైబ్రిడ్‌.. డీజిల్‌ కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుందా?
కియా కార్నివాల్‌ హైబ్రిడ్‌.. డీజిల్‌ కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుందా?

Kia Carnival Hybrid: కియా కార్నివాల్‌ హైబ్రిడ్‌.. డీజిల్‌ కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైబ్రిడ్‌ కార్లకు ఇండియాలో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా తన ప్రీమియం ఎమ్‌పీవీ కార్నివాల్‌లో హైబ్రిడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కార్నివాల్‌ డీజిల్‌ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలో హైబ్రిడ్‌ వేరియంట్‌ కూడా అదే లైనప్‌లో చేరనుంది. దీంతో ఇంధన సామర్థ్యానికి ప్రాధాన్యమిచ్చే కొనుగోలుదారులకు డీజిల్‌కు బదులుగా హైబ్రిడ్‌ మరో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. 2020లో భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కియా కార్నివాల్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెద్ద కుటుంబాలు, డ్రైవర్‌తో ప్రయాణించే ప్రీమియం కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఎమ్‌పీవీ ప్రాక్టికాలిటీతో పాటు లగ్జరీ ఫీచర్లను అందిస్తోంది.

వివరాలు

కార్నివాల్‌ డీజిల్‌ vs హైబ్రిడ్‌.. మైలేజ్‌లో ఎవరు ముందంటే?

2025లో విడుదలైన తాజా తరం కార్నివాల్‌ కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌, ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లో కొనసాగుతోంది.

ఇప్పుడు కార్నివాల్‌ హైబ్రిడ్‌తో పవర్‌ట్రెయిన్‌ పరంగా కియా కీలక మార్పు చేయనుంది. కొత్త హైబ్రిడ్‌ వెర్షన్‌ ప్రస్తుతం ఉన్న డీజిల్‌ మోడల్‌తో పాటు విక్రయించే అవకాశం ఉంది.

భారత్‌లో సోరెంటో హైబ్రిడ్‌ తర్వాత కియా అందించనున్న రెండో హైబ్రిడ్‌ మోడల్‌గా కార్నివాల్‌ నిలవనుంది.

రానున్న వారాల్లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కార్నివాల్‌ హైబ్రిడ్‌లో 1.6 లీటర్‌ టర్బో-పెట్రోల్‌ ఇంజిన్‌కు స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ వ్యవస్థను జత చేయనున్నారు.

వివరాలు

ఎలక్ట్రిక్‌ మోటార్‌ కంటే మరింత శక్తివంతమైనది

ఈ ఇంజిన్‌ ఒక్కటే 180 హెచ్‌పీ పవర్‌, 265 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్‌ మోటార్‌ 73.4 హెచ్‌పీ పవర్‌, 304 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.

ఇది సోరెంటోలో ఉపయోగించిన ఎలక్ట్రిక్‌ మోటార్‌ కంటే మరింత శక్తివంతమైనది.

ప్రస్తుతం విక్రయిస్తున్న కియా కార్నివాల్‌లో 2.2 లీటర్‌ నాలుగు సిలిండర్‌ టర్బో-డీజిల్‌ ఇంజిన్‌ ఉంది.

ఇది 190 హెచ్‌పీ పవర్‌, 441ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీని ద్వారా ముందు చక్రాలకు శక్తి అందుతుంది.

కార్నివాల్‌ హైబ్రిడ్‌ ఇండియా వెర్షన్‌ మైలేజ్‌పై కియా ఇంకా అధికారిక ARAIసర్టిఫికేషన్‌ ప్రకటించలేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడల్‌ దాదాపు 33 mpg మైలేజ్‌ను ఇస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?

అంటే సుమారు 14 కి.మీ/లీ మైలేజ్‌ వస్తుంది. ప్రస్తుతం కార్నివాల్‌ డీజిల్‌ మోడల్‌ ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌ 14.85 కి.మీ/లీగా ఉంది.

అయితే హైబ్రిడ్‌ వాహనాల అసలు ప్రయోజనం నగరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

ట్రాఫిక్‌లో తరచూ ఆగుతూ, ముందుకు కదులుతున్న సమయంలో ఎలక్ట్రిక్‌ మోటార్‌ ఎక్కువగా పనిచేయడం వల్ల ఇంధన వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది.

కార్నివాల్‌ హైబ్రిడ్‌ డిజైన్‌, ఫీచర్ల విషయంలో ప్రస్తుత డీజిల్‌ మోడల్‌ను పోలి ఉండే అవకాశం ఉంది.

ఇందులో ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ కోసం రెండు 12.3 అంగుళాల డిస్‌ప్లేలు ఉండనున్నాయి.

ఇవే కాకుండా మూడు జోన్ల క్లైమేట్‌ కంట్రోల్‌, 12స్పీకర్ల బోస్‌ ఆడియో సిస్టమ్‌, పవర్డ్‌, వెంటిలేటెడ్‌, హీటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు లభించనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

ధర ఎంత ఉండొచ్చు?

భద్రత పరంగా 8 ఎయిర్‌బ్యాగ్స్‌, లెవల్‌-2 ADAS, 360 డిగ్రీల కెమెరా, ముందు, వెనుక డిస్క్‌ బ్రేకులు వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ప్రస్తుతం కియా కార్నివాల్‌ భారత్‌లో కేవలం ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. పూర్తిస్థాయి ఫీచర్లతో కూడిన Limousine Plus వేరియంట్‌ ధర రూ.59.65 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

రానున్న కార్నివాల్‌ హైబ్రిడ్‌ ధర రూ.56 లక్షల నుంచి రూ.61 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉండొచ్చని అంచనా.

డీజిల్‌ మోడల్‌తో పోలిస్తే హైబ్రిడ్‌ వెర్షన్‌కు స్వల్ప ప్రీమియం ఉండే అవకాశం ఉంది.

అయితే కియా తన సోరెంటో హైబ్రిడ్‌ విషయంలో అనుసరించిన ధరల వ్యూహాన్నే కార్నివాల్‌ హైబ్రిడ్‌ విషయంలోనూ కొనసాగిస్తుందా? అనేది చూడాలి.

ADVERTISEMENT