US Open 2026: యుఎస్ ఓపెన్‌లో సంచలనం.. స్వైటెక్, మెద్వెదెవ్ ఔట్!
ఈ వార్తాకథనం ఏంటి
యుఎస్ ఓపెన్‌లో సీడెడ్ ప్లేయర్ల నిష్క్రమణ కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్‌గా భావించిన పోలెండ్ స్టార్ ఇగా స్వైటెక్ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. పురుషుల సింగిల్స్‌లో రష్యా స్టార్ డానియల్ మెద్వెదెవ్ కు అమెరికా ఆటగాడు ఫ్రాన్సిస్ తియాఫో షాకిచ్చాడు. మరోవైపు మిరా ఆండ్రీవా, జెసికా పెగులా, కార్లోస్ అల్కరాస్, బెన్ షెల్టాన్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లారు.
వివరాలు
స్వైటెక్‌కు షాక్
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ ఇగా స్వైటెక్ 5-7, 3-6తో చైనాకు చెందిన కిన్వెన్ జెంగ్ చేతిలో ఓడిపోయింది.
తొలి సెట్‌లో స్వైటెక్ బాగానే ఆడింది. అయితే 11వ గేమ్‌లో సర్వీస్ కోల్పోవడంతో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత సెట్‌ను చేజార్చుకుంది.
రెండో సెట్‌లోనూ కీలక సమయాల్లో స్వైటెక్ తప్పిదాలు చేసింది. ఏడో గేమ్‌లో సర్వీస్ కోల్పోయిన ఆమె.. ఆ తర్వాత సెట్‌తో పాటు మ్యాచ్‌నూ జెంగ్‌కు అప్పగించింది.
ఈ మ్యాచ్‌లో రెండు డబుల్‌ఫాల్ట్స్ చేసిన స్వైటెక్.. 28 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
వివరాలు
పొటపోవా ఓటమి
ఐదో సీడ్ మిరా ఆండ్రీవా మాత్రం క్వార్టర్‌ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో రష్యా యువతార 5-7, 6-4, 6-3తో ఆస్ట్రియాకు చెందిన పొటపోవాను ఓడించింది.
సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన ఆండ్రీవా.. అద్భుతంగా పుంజుకుని తర్వాతి రెండు సెట్లను గెలిచి విజయాన్ని అందుకుంది.
మూడో సెట్ చివర్లో రిటర్న్ చేసే క్రమంలో పొటపోవా గాయపడింది. అప్పటికే మ్యాచ్ ఆండ్రీవా చేతిలోకి వెళ్లినా.. పొటపోవా తిరిగి వచ్చి పోరాడింది.
అయితే కాసేపటికే విజయం ఆండ్రీవాదే అయింది. అమెరికా స్టార్ జెసికా పెగులా కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. మూడో సీడ్ పెగులా 6-3, 6-4తో రొమేనియాకు చెందిన క్రిస్టియాను ఓడించింది.
వివరాలు
మెద్వెదెవ్‌కు తియాఫో షాక్
ఆరో సీడ్ నోస్కోవా 7-5, 5-7, 6-4తో ఉక్రెయిన్‌కు చెందిన కోస్త్యుక్ పై గెలిచింది. అమెరికా క్రీడాకారిణి ఎమా నవారో 6-4, 6-2తో రష్యాకు చెందిన కలిన్‌స్కాయాను ఓడించి ముందంజ వేసింది.
పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ డానియల్ మెద్వెదెవ్ ప్రిక్వార్టర్స్‌లోనే ఓటమి పాలయ్యాడు. 11వ సీడ్ ఫ్రాన్సిస్ తియాఫో 7-6 (7-1), 6-4, 7-6 (8-6)తో మెద్వెదెవ్‌ను ఓడించాడు.
తొలి సెట్‌లో మెద్వెదెవ్ మెరుగ్గా ఆడాడు. ఒక దశలో6-5తో సెట్ గెలిచేందుకు చేరువయ్యాడు. కానీ 12వ గేమ్‌లో సర్వీస్ కోల్పోయాడు. టైబ్రేకర్‌లో తడబడి సెట్‌ను చేజార్చుకున్నాడు.
రెండో సెట్‌లోనూ తియాఫో దూకుడు ప్రదర్శించాడు. ఐదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అమెరికా ఆటగాడు..ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
వివరాలు
సులభంగా విజయాన్ని అందుకున్న అల్కరాస్
మూడో సెట్‌లో మ్యాచ్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో మెద్వెదెవ్ పోరాడాడు. అయితే మరోసారి టైబ్రేకర్‌లో కీలక తప్పిదాలు చేయడంతో సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కోల్పోయాడు.
డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాస్ క్వార్టర్‌ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో అమెరికాకు చెందిన టామీ పాల్ ను 6-4, 6-3, 6-4తో ఓడించాడు.
మ్యాచ్‌లో నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాస్ సులభంగా విజయాన్ని అందుకున్నాడు.
ఎనిమిదో సీడ్ బెన్ షెల్టాన్ 6-2, 6-3, 6-4తో గ్రీస్ స్టార్ సిట్సిపాస్ ను ఓడించి క్వార్టర్స్ చేరాడు.
మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన మికైల్‌సెన్ 7-6 (8-6), 6-4, 6-4తో అర్జెంటీనాకు చెందిన ఎచెవెరీ పై విజయం సాధించాడు.
వివరాలు
బాలాజీ జోడీకి తొలి రౌండ్‌లోనే ముగింపు
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీకు నిరాశ ఎదురైంది.
బాలాజీ-అమెరికాకు చెందిన ఎవాన్ కింగ్ జోడీ తొలి రౌండ్‌లో 4-6, 5-7తో మొనాకోకు చెందిన హ్యూగో-ఫ్రాన్స్‌కు చెందిన వెస్లిన్ జంట చేతిలో ఓడింది.
జూనియర్ బాలికల సింగిల్స్‌లో భారత యువతి మాయ రాజేశ్వరన్ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఆమె 6-2, 6-2తో అమెరికాకు చెందిన ఎమెరీ కోంబ్స్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో మాయ నాలుగు ఏస్‌లు, 12 విన్నర్లు నమోదు చేసింది. జూనియర్ బాలుర సింగిల్స్ తొలి రౌండ్‌లో మాత్రం భారత ఆటగాడు అర్ణవ్ పపార్కర్ కు ఓటమి ఎదురైంది.
అతడు 4-6, 1-6తో అమెరికాకు చెందిన జాన్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.