Sheetal Devi: శీతల్ దేవి అదరగొట్టింది.. స్వర్ణ పతకానికి ఒక్క అడుగు దూరంలో!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న 'ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్'లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. కాంపౌండ్ పారా ప్రపంచ ఛాంపియన్ 'శీతల్ దేవి' అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. దీంతో స్వర్ణ పతకంపై ఆమె గురి పెట్టింది.
వివరాలు
శీతల్ దేవి ఫైనల్‌కు..
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం సెమీఫైనల్లో శీతల్ దేవి 145-143తో భారత్‌కే చెందిన 'సరిత'ను ఓడించింది.
ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన 'ఐజాదా సీడన్'తో శీతల్ తలపడనుంది. మరోవైపు సరిత కాంస్య పతకం కోసం చైనాకు చెందిన వాంగ్ హ్యుటింగ్‌తో పోటీ పడనుంది.
ఈ సిరీస్‌లో భారత ఆర్చర్లకు పలు విభాగాల్లో పతకాలు ఖాయమయ్యాయి. డబ్ల్యూ-1 మహిళల విభాగంలో తన్వి ప్రవీణ్ రజత పతకం సాధించింది.
ఫైనల్లో ఆమె 4-6తో సైప్రస్‌కు చెందిన క్రిస్టోస్ మిసోస్ చేతిలో ఓడింది. డబ్ల్యూ-1 పురుషుల విభాగంలో యుగళ్ గార్గ్ కాంస్యం గెలుచుకున్నాడు.
కాంస్య పతక పోరులో అతను భారత్‌కే చెందిన పవన్ కుమార్‌పై విజయం సాధించాడు.
వివరాలు
రికర్వ్‌లోనూ భారత్ జోరు
పురుషుల రికర్వ్ విభాగం సెమీఫైనల్లో హర్విందర్ సింగ్-విజయ్ సుండి జోడీ 5-1తో చైనాకు చెందిన జియా లీ-జు వెంజాన్ ద్వయాన్ని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
మహిళల రికర్వ్‌లో భావన-పూజ జోడీ కూడా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఈ జంట సెమీఫైనల్లో 6-2తో ఇరాన్ క్రీడాకారులను ఓడించింది.
రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భావన-హర్విందర్ జోడీ 6-0తో ఇండోనేసియా జంటను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది.
వివరాలు
కాంపౌండ్‌లోనూ పతకాలు ఖాయం
పురుషుల కాంపౌండ్ విభాగంలో శ్యామ్ సుందర్-తమన్ కుమార్ జోడీ 154-153తో చైనాకు చెందిన బవో యిరుయ్-ఫెంగ్ యూ ద్వయాన్ని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
కాంపౌండ్ మహిళల విభాగంలో శీతల్ దేవి-పాయల్ నాగ్ జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలై కాంస్య పతకం కోసం పోటీ పడనుంది.
డబ్ల్యూ-1 మహిళల విభాగంలో స్వాతి చౌదరి కూడా కాంస్య పతక పోరుకు చేరుకుంది. సెమీఫైనల్లో ఆమె 1-7తో చైనాకు చెందిన లియు జింగ్ చేతిలో ఓడింది.
పురుషుల కాంపౌండ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ తమన్ కుమార్ కు సెమీఫైనల్లో నిరాశ ఎదురైంది.
వివరాలు
కాంస్యం కోసం బరిలోకి దిగనున్న తమన్ కుమార్
ఇండోనేసియాకు చెందిన కెన్ స్వాగుమిలాంగ్ చేతిలో 144-146తో ఓడిపోయాడు. దీంతో తమన్ కుమార్ కాంస్యం కోసం బరిలోకి దిగనున్నాడు.
ఇక మరో భారత కాంపౌండ్ ఆర్చర్ గుర్విందర్ సింగ్ క్వార్టర్ ఫైనల్లో 141-143తో స్వాగుమిలాంగ్ చేతిలో ఓడి పతకానికి దూరమయ్యాడు.
డబ్ల్యూ-1 పురుషుల విభాగంలో భారత ఆర్చర్లు అడిల్ నజీర్, నూరుద్దీన్ కూడా క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యారు.