Mahindra: ఈ20 పెట్రోల్‌పై మహీంద్రా స్పష్టత.. పాత కార్లకూ సురక్షితమే
ఈ వార్తాకథనం ఏంటి
ఈ20 పెట్రోల్ వాడకంపై నెలకొన్న సందేహాలకు మహీంద్రా తెరదించింది. తమ పెట్రోల్ వాహనాలన్నీ ఈ20 ఇంధనాన్ని సురక్షితంగా వినియోగించగలవని కంపెనీ స్పష్టం చేసింది. అయితే కొత్తగా తయారైన మోడళ్లు ఈ20కు మరింత అనుకూలంగా ఉండటంతో వాటి పనితీరు మెరుగ్గా ఉంటుందని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ20 ఇంధనంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఓ వినియోగదారు అడిగిన ప్రశ్నకు మహీంద్రా కస్టమర్ కేర్ అధికారికంగా స్పందించింది. "ప్రస్తుతం అమల్లో ఉన్న పెట్రోల్ ప్రమాణాలకు మహీంద్రా ఇంజిన్లు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయి. మా పెట్రోల్ వాహనాలన్నింటిలోనూ ఈ20 ఇంధనాన్ని సురక్షితంగా ఉపయోగించవచ్చు" అని పేర్కొంది.
వివరాలు
2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలకు.. ఈ20 ఇంధనానికి ప్రత్యేకంగా ట్యూన్ చేసిన కంపెనీ
గతంలో ఈ20కు అనుకూలమైన వాహనాల గురించి మాత్రమే వివరించిన కంపెనీ, ఇప్పుడు మరింత స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలను ఈ20 ఇంధనానికి ప్రత్యేకంగా ట్యూన్ చేసినట్లు తెలిపింది. ఈ వాహనాల్లో వేగంగా స్పందించడం (యాక్సిలరేషన్), ఇంధన సామర్థ్యం మరింత మెరుగ్గా ఉండేలా ఇంజిన్ సెట్టింగులు చేసినట్లు వెల్లడించింది. అదే సమయంలో 2025 ఏప్రిల్ 1కు ముందు తయారైన మహీంద్రా పెట్రోల్ కార్లలో కూడా ఈ20 పెట్రోల్‌ను ఎలాంటి ఆందోళన లేకుండా వాడొచ్చని కంపెనీ స్పష్టం చేసింది. అయితే డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులను బట్టి యాక్సిలరేషన్ లేదా మైలేజీలో స్వల్ప మార్పులు కనిపించే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
ఈ20 ఇంధనం వల్ల వాహనాల పనితీరుపై పలు సందేహాలు
ఇటీవలి కాలంలో ఈ20 ఇంధనం వల్ల వాహనాల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా ఇచ్చిన వివరణ ప్రస్తుత వినియోగదారులతో పాటు కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా స్పష్టతనిచ్చేలా ఉంది. ఈ20లో ఇథనాల్ శాతం ఎక్కువగా ఉండటంతో, ఈ10తో పోలిస్తే ఇంధన శక్తి స్వల్పంగా తగ్గవచ్చని, దాంతో మైలేజీలో చిన్న మార్పు ఉండొచ్చని ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ఈ20కు అనుకూలంగా రూపొందించిన ఇంజిన్లకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తున్నాయి. మహీంద్రా ప్రకటనకు ముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో టయోటా, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ సంస్థల ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వివరాలు
ఇన్నోవా హైక్రాస్‌కు సంబంధించిన వైరల్ ఘటనపై స్పందించిన టయోటా
ఈ20 ఇంధనం అనుకూల వాహనాలకు పూర్తిగా సురక్షితమని, కొంతమందికి మైలేజీలో మాత్రమే స్వల్ప మార్పు కనిపించే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో ఇన్నోవా హైక్రాస్‌కు సంబంధించిన వైరల్ ఘటనపై టయోటా స్పందించింది. ఆ సమస్యకు ఈ20 ఇంధనం కారణం కాదని, కలుషితమైన ఇంధనం వల్లే ఆ ఘటన జరిగిందని వివరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వాహన తయారీ సంస్థలు మరింత స్పష్టమైన సమాచారం అందిస్తున్నాయి.