Mitsubishi: ఐదేళ్ల విరామం తర్వాత సరికొత్త పజెరో ఎస్‌యూవీని ఆవిష్కరించిన మిత్సుబిషి
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మిత్సుబిషి సరికొత్త ఐదో తరం పజెరో ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించింది. కొన్ని మార్కెట్లలో మోంటెరో పేరుతో కూడా విక్రయించే ఈ ఆఫ్‌రోడర్.. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి రానుంది. ముందుగా థాయ్‌లాండ్‌లో ఈ కొత్త మోడల్‌ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 2027 మార్చి నాటికి జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లలోకి తీసుకురానున్నారు. అయితే అమెరికా, భారత మార్కెట్లలో ఈ కొత్త పజెరో అందుబాటులోకి వస్తుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. మిత్సుబిషి పజెరో తొలిసారిగా 1982లో మార్కెట్లోకి వచ్చింది. 2021లో ఉత్పత్తిని నిలిపివేసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాల్లో 33 లక్షలకు పైగా పజెరో యూనిట్లు విక్రయమయ్యాయి.
వివరాలు
ట్రిటాన్ పికప్ ఆధారంగా కొత్త పజెరో..
కొత్త పజెరోను మిత్సుబిషి ట్రిటాన్ పికప్‌కు చెందిన ఫ్రేమ్ ఆధారంగా రూపొందించింది.
అయితే మూడు వరుసల సీట్లతో కూడిన ఎస్‌యూవీగా ఉండేలా దీనిని పూర్తిగా రీడిజైన్ చేసింది.
ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో బాక్సీ డిజైన్‌లో కనిపించే ఈ కొత్త పజెరో.. టయోటా ల్యాండ్ క్రూయిజర్‌కు పోటీగా నిలిచే అవకాశం ఉంది.
ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. ట్రిటాన్ రేంజ్‌లో ఉపయోగించే టర్బోచార్జ్డ్ 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌నే కొత్త పజెరోలోనూ ఉపయోగించనున్నట్లు మిత్సుబిషి వెల్లడించింది.
ఈ ఇంజిన్ 204 హెచ్‌పీ పవర్, 480 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
సూపర్ సెలెక్ట్ 4WD-II సిస్టమ్
ఆఫ్‌రోడ్ డ్రైవింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కొత్త పజెరోలో మిత్సుబిషి సూపర్ సెలెక్ట్ 4WD-II ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించింది.
ఇందులో డ్రైవర్‌కు నాలుగు విభిన్న డ్రైవింగ్ మోడ్‌లను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
డిజైన్ పరంగా చూస్తే ఐదో తరం పజెరో.. గత మోడళ్లతో పెద్దగా పోలిక లేకుండా ఉంది.
ప్రాంతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న డెస్టినేటర్, ఎక్స్‌ఫోర్స్ మోడళ్ల నుంచి కొన్ని డిజైన్ అంశాలను తీసుకున్నారు.
ఉబ్బెత్తుగా కనిపించే ఫెండర్లు, పెద్ద ఫ్రంట్ గ్రిల్ కారణంగా కొత్త పజెరో మరింత ఆకట్టుకునే, దృఢమైన రూపాన్ని సొంతం చేసుకుంది.
స్కల్ప్టెడ్ బాడీ డిజైన్‌తో విశాలమైన క్యాబిన్‌ను అందించారు. ఫ్లాట్ రూఫ్‌లైన్‌తో పాటు వాహనం ముందు, వెనుక భాగాల్లో అండర్‌బాడీ ప్రొటెక్షన్‌ను కూడా అందించారు.
వివరాలు
లెదర్ ఇంటీరియర్.. 7 మంది ప్రయాణించేలా సీటింగ్
కొత్త పజెరోలో మూడు వరుసల సీటింగ్ లేఅవుట్ ఉంటుంది. ఇందులో ఏడుగురు ప్రయాణించవచ్చు.
రెండో వరుస సీట్లను 150 మిల్లీమీటర్ల మేర ముందుకు, వెనక్కి జరపవచ్చు.
అంతేకాకుండా వాటిని మడిచేందుకు కూడా వీలుంది. దీంతో అదనపు లగేజీ స్థలాన్ని పొందడంతో పాటు మూడో వరుసలో కూర్చునే ప్రయాణికులకు సులభంగా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది.
మిత్సుబిషి వాహనాల్లో సాధారణంగా కనిపించే దానికంటే కొత్త పజెరో ఇంటీరియర్ మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.
టాప్ వేరియంట్‌లో దాదాపు అన్ని ఉపరితలాలకు లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు.
అంతేకాకుండా అన్ని డోర్లకు డబుల్ గ్లేజ్డ్ విండోలను అందించారు. క్యాబిన్‌లో శబ్దం తగ్గించేందుకు అకౌస్టిక్ విండ్‌షీల్డ్‌ను కూడా ఇచ్చారు.