Mojatba Khamenei: పెళ్లి వేడుకపై దాడి.. అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం తప్పదు: ఖమేనీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ వారం ఆరంభం నుంచి ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి. రాత్రి సమయంలో ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లోని లక్ష్యాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ క్రమంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఓ ఇంటిపై క్షిపణి శకలాలు పడటంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లో అమెరికాకు చెందిన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
వివరాలు
అమెరికాకు ఖమేనీ తీవ్ర హెచ్చరిక
ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. తమ బలగాలు అగ్రరాజ్యానికి మర్చిపోలేని గుణపాఠం చెబుతాయని స్పష్టం చేశారు.
ఈ వారం ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తర్వాత ఖమేనీ తొలిసారిగా స్పందించారు.
అమెరికా తమపై ఎందుకు దాడులు చేసిందా? అని భవిష్యత్తులో ఆ దేశం పశ్చాత్తాపపడేలా చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ప్రతినిధి హుస్సేన్ మొహెబి హెచ్చరించారు.
తమపై జరిగిన దాడులకు తగిన సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
హర్మూజ్‌లో మళ్లీ సీమైన్స్?
హర్మూజ్ జలసంధిలోని కీలక రవాణా మార్గాల్లో ఏర్పాటు చేసిన సీమైన్స్‌ను తొలగించినట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది.
అయితే ఇరాన్ మళ్లీ ఆ ప్రాంతంలో సీమైన్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందని అమెరికా ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ఇరాన్ రాకెట్ ప్రయోగ వేదికలను లక్ష్యంగా చేసుకుని అమెరికా బలగాలు దాడులు చేశాయి.
దీంతో దాదాపు నెల రోజులుగా నిలిచిపోయిన ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణలు మరోసారి ప్రారంభమయ్యాయి. తాజా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.