BYD Atto 3: 630KM రేంజ్‌తో కొత్త BYD అట్టో 3.. 9 నిమిషాల్లోనే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తమ కొత్త తరం BYD Atto 3 ఎలక్ట్రిక్ SUVను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది కేవలం సాధారణ ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాకుండా, ప్రయాణంలో స్మార్ట్ గాడ్జెట్‌లా పనిచేసే ఆధునిక ఫీచర్లతో రూపొందించారు. ఎక్కువ రేంజ్, లగ్జరీ ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందించేలా కంపెనీ ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. కొత్త తరం అట్టో 3 చైనాలో నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర సుమారు రూ.17 లక్షలుగా ఉంది.
వివరాలు
పెద్ద సైజ్.. మరింత బలమైన డిజైన్
పాత మోడల్‌తో పోలిస్తే కొత్త అట్టో 3 మరింత పెద్దదిగా, దృఢమైన నిర్మాణంతో వచ్చింది. ఈ SUV పొడవు 4665 మిమీ, వెడల్పు 1895 మిమీ, ఎత్తు 1675 మిమీగా ఉన్నాయి. ఇందులో 2770 మిమీ వీల్‌బేస్‌ను అందించారు. కంపెనీ ప్రత్యేకమైన 'డ్రాగన్ ఫేస్' డిజైన్ లాంగ్వేజ్‌తో ఈ మోడల్‌ను తీర్చిదిద్దారు. స్టోరేజ్ విషయంలో కూడా ఈ ఎలక్ట్రిక్ SUV ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో 180 లీటర్ల ఫ్రంక్ స్పేస్ ఉండగా, వెనుక భాగంలో 750 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను అందించారు.
వివరాలు
లగ్జరీ ఫీచర్లతో స్మార్ట్ క్యాబిన్
కొత్త అట్టో 3లో పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్‌తో పాటు డి'లింక్ ఇంటర్‌ఫేస్‌ను అందించారు. అలాగే టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, 16-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టాప్ వేరియంట్లలో లిడార్ ఆధారిత డిపైలట్ 300 అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా లభిస్తుంది. ఇందులో సిటీ నావిగేషన్, ఆటోమేటెడ్ పార్కింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
వివరాలు
ప్రయాణికుల సౌకర్యానికి ప్రత్యేక ఫీచర్లు
కొత్త BYD అట్టో 3లో రిఫ్రిజిరేటెడ్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, వెనుక సీటు డ్రాయర్, ప్రత్యేక టిష్యూ హోల్డర్ వంటి అనేక ఉపయోగకరమైన ఫీచర్లు అందించారు. అదనంగా, ముందు ప్రయాణీకుడి కోసం లెగ్ సపోర్ట్‌తో కూడిన రిలాక్స్ సీటును ఏర్పాటు చేసి మరింత కంఫర్ట్‌ను కల్పించారు. కొత్త బ్యాటరీ టెక్నాలజీతో భారీ రేంజ్ ఈ ఎలక్ట్రిక్ SUVను BYD కొత్త ఇ-ప్లాట్‌ఫామ్ 3.0 ఇవో ఆధారంగా రూపొందించారు. ఇందులో రెండో తరం బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించారు. కొత్త అట్టో 3 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అవి 57.5 kWhబ్యాటరీ ప్యాక్ 68.5 kWh బ్యాటరీ ప్యాక్ ఈ రెండు వేరియంట్లు వరుసగా గరిష్టంగా 540కి.మీ, 630కి.మీ CLTC రేంజ్‌ను అందిస్తాయి.
వివరాలు
9 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్
BYD కొత్త ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఈ SUV సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో కేవలం 9 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 97 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. శక్తివంతమైన పనితీరు కొత్త తరం అట్టో 3 రియర్-వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 268 హార్స్‌పవర్ నుంచి 322 హార్స్‌పవర్ వరకు పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త తరం BYD అట్టో 3 ఎలక్ట్రిక్ SUVను 2027 నాటికి భారత మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.