Electric car : రూ.6.89 లక్షలకే కొత్త సిట్రోయెన్ e-C3X EV.. 320 కి.మీ రేంజ్‌తో అదిరిపోయే ఆఫర్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో మధ్యతరగతి వినియోగదారులను మరింత ఆకర్షించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇండియా కొత్త అడుగు వేసింది. దేశీయ మార్కెట్లో 2026 సిట్రోయెన్ ఈ-సీ3ఎక్స్ (e-C3X) ఎలక్ట్రిక్ కారును అధికారికంగా విడుదల చేసింది. ఈ అర్బన్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.10.25 లక్షలుగా నిర్ణయించింది. అయితే ఈ కారును మరింత అందుబాటు ధరలో వినియోగదారులకు అందించేందుకు కంపెనీ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. జెడ్‌జీఎమ్ గ్రూప్ భాగస్వామ్యంతో 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కస్టమర్లు బ్యాటరీ ధరను మినహాయించి కారును కేవలం రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
వివరాలు
కిలోమీటరకు రూ.2.26చొప్పున అందించాలి
అనంతరం బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.2.26 చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ BaaS ధరలు కేవలం పరిచయ ఆఫర్ (Introductory Offer) కింద మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ-సీ3ఎక్స్ నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు కేవలం రూ.0.19 (19 పైసలు) మాత్రమే అవుతుందని, ఇది ఈ విభాగంలోనే అత్యంత తక్కువ ఖర్చు అని సిట్రోయెన్ పేర్కొంది. ప్రస్తుతం ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు సమీప సిట్రోయెన్ డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
వివరాలు
స్టైలిష్ డిజైన్.. ఆకట్టుకునే డైమెన్షన్స్
సిట్రోయెన్ ఈ-సీ3ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, దాని డిజైన్ చూస్తే శక్తివంతమైన ఎస్‌యూవీలా కనిపిస్తుంది. ముందుభాగంలో కొత్త LED లైటింగ్ సిగ్నేచర్, LED హెడ్‌ల్యాంప్స్, LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ అందించారు. ఈ కారు 15-ఇంచుల డైమండ్-కట్ అలాయ్ వీల్స్‌పై నడుస్తుంది. స్పోర్టీ లుక్ కోసం ముందు, వెనుక భాగాల్లో స్కిడ్ ప్లేట్లు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, వెనుక వైపున ప్రత్యేక 'X' బ్యాడ్జింగ్‌ను అమర్చారు. అలాగే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఆటో-ఫోల్డింగ్ ఫీచర్‌తో కూడిన అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్లు ఉన్నాయి. భారతీయ రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అందించారు. కేవలం 4.98మీటర్ల టర్నింగ్ రేడియస్ ఉండటంతో రద్దీగా ఉండే నగర రోడ్లలో కూడా సులభంగా మలుపులు తిప్పవచ్చు.
వివరాలు
ప్రీమియం ఇంటీరియర్.. లగ్జరీ ఫీచర్లు
దీని వీల్‌బేస్ 2,450 ఎంఎంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం ఆరు మోనోటోన్ రంగుల్లో లభిస్తుంది. వాటిలో పోలార్ వైట్, స్టీల్ గ్రే, కాస్మో బ్లూ, పెర్లా నెరా బ్లాక్, గార్నెట్ రెడ్, డీప్ ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి క్యాబిన్‌లో అడుగుపెడితే ప్రీమియం అనుభూతి కలుగుతుంది. ఇందులో LED ఇంటీరియర్ లైటింగ్, డ్యూయల్-టోన్ లెథరెట్ సీట్లు అందించారు. మొత్తం ఇంటీరియర్‌ను ఎలక్ట్రిక్ బ్లూ థీమ్‌లో రూపొందించారు. డ్రైవర్ సమాచారం కోసం 7.0-ఇంచుల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను, వినోదం కోసం వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు.
వివరాలు
40కి పైగా రిమోట్ యాక్సెస్ ఫీచర్లు
ఇందులో ఎలక్ట్రోక్రోమిక్ IRVM, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 40కి పైగా రిమోట్ యాక్సెస్ ఫీచర్లను అందించే Connected Car 2.0 సూట్ వంటి డిజిటల్ ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రీమియం JBL ఆడియో సిస్టమ్‌ను కూడా అందించారు. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సిట్రోయెన్ ప్రత్యేకంగా ట్యూన్ చేసిన సస్పెన్షన్ సిస్టమ్‌ను ఉపయోగించింది. ఈ విభాగంలోనే అత్యుత్తమంగా 1,375 ఎంఎం షోల్డర్ రూమ్ అందించడంతో వెనుక సీట్లలో ప్రయాణికులు విశాలంగా కూర్చోవచ్చు. లగేజ్ కోసం 315 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇంటీరియర్‌ను మూడు వేర్వేరు షేడ్ ఆప్షన్లలో ఎంపిక చేసుకోవచ్చు.
వివరాలు
భద్రతకు పెద్దపీట
సేఫ్టీ పరంగా కూడా కంపెనీ ఎలాంటి రాజీ పడలేదు. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS బ్రేకింగ్ సిస్టమ్, పిల్లల భద్రత కోసం ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా స్పీడ్-సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా అందించారు. వీటితో పాటు ప్రిడిక్టివ్ సేఫ్టీ టెక్నాలజీతో పనిచేసే ఫ్రంట్, రియర్ డ్యాష్‌క్యామ్‌లను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. వీటి ద్వారా లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫ్రంట్ వెహికల్ డిస్టెన్స్ అలర్ట్, పాదచారులు లేదా ఇతర చిన్న వాహనాలను గుర్తించి హెచ్చరించే పెడెస్ట్రియన్ వార్నింగ్ సిస్టమ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు లభిస్తాయి.
వివరాలు
పవర్‌ట్రెయిన్, రేంజ్
సిట్రోయెన్ ఈ-సీ3ఎక్స్‌లో పవర్‌ట్రెయిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 29.2 kWh LFP బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది ముందు భాగంలో అమర్చిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ సెటప్ గరిష్టంగా 56 bhp శక్తిని, 143 Nm తక్షణ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కారు గరిష్టంగా 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.