Loading...
Citroen Aircross X: సిట్రోయెన్‌ కార్లలో కొత్త వేరియంట్లు.. eC3 X రేంజ్‌ 330 కి.మీ!
సిట్రోయెన్‌ కార్లలో కొత్త వేరియంట్లు.. eC3 X రేంజ్‌ 330 కి.మీ!

Citroen Aircross X: సిట్రోయెన్‌ కార్లలో కొత్త వేరియంట్లు.. eC3 X రేంజ్‌ 330 కి.మీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో సిట్రోయెన్‌ (Citroen) తన Aircross X, Basalt X SUVల శ్రేణిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కొత్త టర్బో-పెట్రోల్‌, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ వేరియంట్లను పరిచయం చేసింది. అదే సమయంలో 330 కిలోమీటర్ల సర్టిఫైడ్‌ రేంజ్‌తో eC3 X Extended ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త వేరియంట్ల ద్వారా కస్టమర్లు తమకు అవసరమైన ఇంజిన్‌ ఆప్షన్‌కు అనుగుణంగా కావాల్సిన ఫీచర్లను ఎంచుకునే వెసులుబాటు లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడళ్లు సెప్టెంబర్‌ 7 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సిట్రోయెన్‌ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వచ్చాయి.

వివరాలు

కొత్త సిట్రోయెన్‌ ఎయిర్‌క్రాస్‌ ఎక్స్‌ వేరియంట్లు

సిట్రోయెన్‌ Aircross X లైనప్‌లో కొత్తగా YOU Turbo Comfort Editionను తీసుకొచ్చింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.10.69 లక్షలు.

ఇప్పటివరకు టర్బో-పెట్రోల్‌ ఇంజిన్‌ కావాలంటే Plus లేదా Max వంటి అధిక వేరియంట్లకు వెళ్లాల్సి వచ్చేది. కొత్త YOU Turbo Comfort Editionతో తక్కువ ధరలోనే టర్బో-పెట్రోల్‌ ఇంజిన్‌ను పొందే అవకాశం లభించింది.

అలాగే Aircross X MAX NA వేరియంట్‌ను రూ.11.62 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో పరిచయం చేసింది. ఇందులో హైయర్‌-స్పెక్‌ Max ట్రిమ్‌తో పాటు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది.

దీంతో మెరుగైన ఫీచర్లున్న Max వేరియంట్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

వివరాలు

బసాల్ట్‌ ఎక్స్‌లోనూ టర్బో-పెట్రోల్‌ ఆప్షన్

ప్రస్తుతం Aircross X YOU వేరియంట్ల ధరలు రూ.8.89 లక్షల నుంచి రూ.9.09 లక్షల వరకు ఉన్నాయి.

మరోవైపు టర్బో-పెట్రోల్‌ Max వేరియంట్ల ధరలు రూ.12.97 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

కొత్త వేరియంట్లతో ఇంజిన్‌, ఫీచర్ల కలయికలో ఇప్పటివరకు ఉన్న ఖాళీలను సిట్రోయెన్‌ భర్తీ చేసింది. సిట్రోయెన్‌ Basalt X శ్రేణిలోనూ ఇదే తరహా మార్పులు చేసింది.

కొత్తగా Basalt X YOU Turbo వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.9.99 లక్షలు. Basalt X లైనప్‌లో టర్బో-పెట్రోల్‌ ఇంజిన్‌తో లభించే అత్యంత అందుబాటు ధర వేరియంట్‌ ఇదే.

ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ YOU వేరియంట్ల కంటే కొంత ఎక్కువ ధరలో ఉంది.

ADVERTISEMENT

వివరాలు

ధరలను అధికారికంగా వెల్లడించలేదు

ప్రస్తుతం వాటి ధరలు రూ.8.55 లక్షల నుంచి రూ.8.75 లక్షల మధ్య ఉన్నాయి.

అదే సమయంలో Basalt X MAX NA వేరియంట్‌ను రూ.11.34 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో పరిచయం చేసింది.

ఇప్పటివరకు Max స్థాయి ఫీచర్లు కావాలనుకునే కస్టమర్లు టర్బో-పెట్రోల్‌ వెర్షన్‌ను మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చేది. దాని ధర రూ.12.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

కొత్త MAX NAతో అదే స్థాయి ఫీచర్లను న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో తక్కువ ధరకు పొందవచ్చు.

న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ వేరియంట్లు పెట్రోల్‌తో పాటు CNG ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉంటాయని సిట్రోయెన్‌ తెలిపింది. అయితే CNG వెర్షన్లకు సంబంధించిన ప్రత్యేక ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ADVERTISEMENT

వివరాలు

సిట్రోయెన్‌ eC3 X Extended

ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌ వేరియంట్లతో పాటు సిట్రోయెన్‌ eC3 X Extended ఎలక్ట్రిక్‌ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా విడుదల చేసింది.

ఇది MIDC-I/II సైకిల్‌ ప్రకారం 330 కిలోమీటర్ల సర్టిఫైడ్‌ రేంజ్‌ను అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న eC3 Xలో పేర్కొన్న 325 కిలోమీటర్ల రేంజ్‌తో పోలిస్తే ఇది 5 కిలోమీటర్లు ఎక్కువ.

బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడం వల్ల కాకుండా.. సామర్థ్యాన్ని మెరుగుపరిచే మార్పుల కారణంగానే రేంజ్‌ పెరిగిందని సిట్రోయెన్‌ వెల్లడించింది.

eC3 X Extendedలో 29.2kWh లిథియం-అయాన్‌ బ్యాటరీనే కొనసాగించారు. ఇది 143Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వివరాలు

ఛార్జ్ చేయడానికి 57 నిమిషాల సమయం

దీని గరిష్ఠ వేగం 107kmph కాగా.. 0-60kmph వేగాన్ని 6.8 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ద్వారా బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్‌ చేయడానికి సుమారు 57 నిమిషాల సమయం పడుతుంది.

ఇక eC3 X Extendedను సిట్రోయెన్‌ Battery-as-a-Service (BaaS) ప్రోగ్రామ్‌ ద్వారా కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.

ఈ విధానంలో వాహనం ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే బ్యాటరీ వినియోగానికి ప్రతి కిలోమీటరుకు రూ.2.26 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT