Loading...
NHAI: టోల్‌ చెల్లింపుల్లో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త విధానం.. రూ.350కే లోకల్ పాస్
టోల్‌ చెల్లింపుల్లో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త విధానం.. రూ.350కే లోకల్ పాస్

NHAI: టోల్‌ చెల్లింపుల్లో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త విధానం.. రూ.350కే లోకల్ పాస్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక ఊరట కల్పించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 121 టోల్‌ప్లాజాల వద్ద డిజిటల్ లోకల్ పాస్ సదుపాయాన్ని విస్తరించింది. ఈ పథకం కింద సంబంధిత టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హత కలిగిన స్థానికులు కేవలం రూ.350 చెల్లించి నెలవారీ పాస్ పొందొచ్చు. ఈ పాస్‌ ద్వారా సంబంధిత టోల్‌ప్లాజా వద్ద నెల రోజుల పాటు ఎన్నిసార్లైనా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ డిజిటల్ లోకల్ పాస్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగనుండటంతో స్థానిక వాహనదారులకు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభం కానుంది.

వివరాలు 

డిజిటల్ విధానంతో లోకల్ పాస్ ప్రక్రియ సులభతరం

వాణిజ్యేతర వాహనాలు కలిగిన అర్హులైన వినియోగదారులు 'రాజమార్గయాత్ర' మొబైల్ యాప్ ద్వారా పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుదారుడి నివాస చిరునామా, వాహన వివరాలు, ఫాస్టాగ్ తదితర సమాచారాన్ని డిజీలాకర్, వాహన్ (VAHAN) పోర్టల్స్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ధ్రువీకరిస్తారు.

దీంతో గతంలో మాదిరిగా పత్రాలు పట్టుకుని టోల్‌ప్లాజా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం చాలావరకు ఉండదు.

పాస్ మంజూరైన తర్వాత అది నేరుగా సంబంధిత వాహనం ఫాస్టాగ్‌తో అనుసంధానమవుతుంది.

దీంతో టోల్‌ప్లాజా వద్ద స్థానిక వాహనదారుల ప్రయాణాన్ని సులభంగా గుర్తించే వీలు కలుగుతుంది.

మొత్తం ప్రక్రియను డిజిటల్‌గా మార్చడం ద్వారా స్థానికులకు సౌకర్యంతో పాటు టోల్ వసూళ్ల వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రయత్నిస్తోంది.

వివరాలు 

బ్యారియర్‌ లేని టోలింగ్‌కు ముందడుగు..

బ్యారియర్-రహిత 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో' టోలింగ్ వ్యవస్థను భవిష్యత్తులో అమలు చేసే దిశగా ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతున్న చర్యల్లో ఈ డిజిటల్ లోకల్ పాస్ కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

కొత్త ఆటోమేటెడ్ టోలింగ్ విధానం అమల్లోకి వస్తే సరైన లోకల్ పాస్ లేకుండా ప్రయాణించే స్థానిక వాహనదారులకు టోల్ చెల్లించలేదన్న కారణంతో ఈ-నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకే డిజిటల్ లోకల్ పాస్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.

దేశంలో తొలి డిజిటల్ లోకల్ పాస్‌ను గత నెలలో ఢిల్లీలోని ముండ్కా-బక్కర్‌వాలా టోల్‌ప్లాజా వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

ఆ తర్వాత ఈ సదుపాయాన్ని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మరిన్ని టోల్‌ప్లాజాలకు విస్తరిస్తున్నారు. ప్రస్తుతం 121 టోల్‌ప్లాజాల్లో ఈ డిజిటల్ పాస్ అందుబాటులో ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

రూ.350 లోకల్ పాస్‌కు ప్రత్యేక నిబంధనలు.. వార్షిక పాస్‌తో సంబంధం లేదు

ఈ 121 టోల్‌ప్లాజాల పూర్తి జాబితాను 'రాజమార్గయాత్ర' యాప్‌లో చూడొచ్చు.

అయితే సంబంధిత టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధికి అవతల నివసించే వారికి ఈ రూ.350 లోకల్ పాస్ వర్తించదు.

అలాగే డిజిటల్ పాస్ సదుపాయం అందుబాటులో లేని టోల్‌ప్లాజాల వద్ద కూడా అర్హులు పాత విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇందుకోసం నేరుగా సంబంధిత టోల్‌ప్లాజా కార్యాలయాన్ని సంప్రదించాలి.

ఇదిలా ఉండగా, రూ.350తో అందించే ఈ నెలవారీ లోకల్ పాస్‌ను ఎన్‌హెచ్‌ఏఐ అందిస్తున్న వార్షిక పాస్‌తో కలిపి చూడకూడదని అధికారులు స్పష్టం చేశారు.

2026-27 సంవత్సరానికి రూ.3,075గా నిర్ణయించిన వార్షిక పాస్‌కు ఈ రూ.350 లోకల్ పాస్ పూర్తిగా భిన్నమైనది. రెండింటి అర్హతలు, ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి.

ADVERTISEMENT