Loading...
TTD: తిరుమల అడవుల్లో రోబో పహారా.. చిరుతల కదలికలపై రియల్‌టైమ్ నిఘా
తిరుమల అడవుల్లో రోబో పహారా.. చిరుతల కదలికలపై రియల్‌టైమ్ నిఘా

TTD: తిరుమల అడవుల్లో రోబో పహారా.. చిరుతల కదలికలపై రియల్‌టైమ్ నిఘా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించడంతో పాటు భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు తితిదే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా మనుషులు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండే కొండకోనల్లోనూ సులభంగా సంచరించగల 'క్వాడ్రుపెడ్‌ రోబోట్‌'ను ప్రయోగాత్మకంగా వినియోగించేందుకు సిద్ధమవుతోంది. నాలుగు కాళ్లతో ఉండే ఈ రోబో డాగ్‌ అటవీ ప్రాంతంలో తిరుగుతూ రియల్‌టైమ్‌లో నిఘా ఉంచనుంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద గురువారం ఈ రోబో పనితీరును తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. రోబో పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. చెన్నైకి చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ ఈ ఆధునిక రోబోను రూపొందించింది.

వివరాలు 

చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే పసిగట్టగల రోబో

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ రోబో డాగ్‌ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించగలదు.

కారుచీకటి, దట్టమైన పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ నిఘా కొనసాగించగల సామర్థ్యం దీనికి ఉంది.

మెట్లు, రాళ్లు ఉన్న క్లిష్టమైన మార్గాల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగగలదు.

ముఖ్యంగా అలిపిరి-తిరుమల నడక మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ఈ రోబో ముందుగానే పసిగట్టనుంది.

భక్తులు రాకపోకలు సాగించే ప్రాంతాల వైపు జంతువులు కదులుతున్నట్లు గుర్తించిన వెంటనే కంట్రోల్‌ రూమ్‌తో పాటు పెట్రోలింగ్‌ సిబ్బందికి సమాచారం చేరుతుంది.

వివరాలు 

ఒక్కో రోబో డాగ్‌ ధర ఎంతంటే.. 

వన్యప్రాణుల కదలికలకు సంబంధించిన జియో-ట్యాగ్‌తో కూడిన అలర్ట్‌, లైవ్‌ వీడియో, థర్మల్‌ ఫీడ్‌ను రోబో డాగ్‌ వెంటనే పంపించగలదు.

దీంతో అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలను సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా ఇందులో అమర్చిన సౌండ్‌, లైట్‌ యూనిట్లను ఉపయోగించి జంతువులను తాకకుండా వాటిని తిరిగి అడవిలోకి మళ్లించే అవకాశం కూడా ఉంటుంది.

ఒక్కో రోబో డాగ్‌ ధర సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది.

ప్రస్తుతం ఒక రోబోను తిరుమలకు తీసుకొచ్చి 20 రోజులపాటు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు.

వచ్చే నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాల సమయంలో ఈ రోబోను అటవీ ప్రాంతంలో వినియోగించనున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT