LOADING...
Royal Enfield: ఫెరారీ, ఆడిని వెనక్కి నెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అరుదైన ఘనత
ఫెరారీ, ఆడిని వెనక్కి నెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అరుదైన ఘనత

Royal Enfield: ఫెరారీ, ఆడిని వెనక్కి నెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అరుదైన ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే మూడో అత్యంత దృఢమైన ఆటోమోటివ్‌ బ్రాండ్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఫెరారీ, ఆడి వంటి అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లను వెనక్కి నెట్టి.. బీఎండబ్ల్యూ, టయోటా వంటి అగ్రశ్రేణి కంపెనీల సరసన నిలిచింది. ఈ విషయాన్ని బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో టయోటా, బీఎండబ్ల్యూ నిలవగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆడి నాలుగో స్థానంలో ఉండగా.. ఫెరారీ ఏడో స్థానానికి పరిమితమైంది.

వివరాలు

ఆ సంస్థకు 3,200కుపైగా రిటైల్ అవుట్‌లెట్‌లు

నివేదిక ప్రకారం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 100లో 88.9 బ్రాండ్ స్ట్రెంథ్ ఇండెక్స్ స్కోరును సాధించింది. అలాగే AAA రేటింగ్‌ను కూడా దక్కించుకుంది. కంపెనీ బ్రాండ్ విలువ 30 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనికి 3,200కుపైగా రిటైల్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా యూరప్, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఈ బైక్‌లకు భారీ డిమాండ్ ఉంది.

వివరాలు

వినియోగదారులను ఆకట్టుకుంటున్న హంటర్ 350

ఒకప్పుడు రెట్రో మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బలమైన బ్రాండ్ విలువతో దూసుకుపోతోంది. కంపెనీకి చెందిన హంటర్ 350, సూపర్ మెటియోర్ 650, కొత్త హిమాలయన్ 450 వంటి మోడళ్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పాటు మరికొన్ని భారతీయ కంపెనీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. టాటా మోటార్స్ ఐదో స్థానంలో నిలవగా.. మహీంద్రా 25వ స్థానంలో, మారుతీ సుజుకి 34వ స్థానంలో నిలిచాయి.

Advertisement