Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 స్పెసిఫికేషన్స్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 మోడల్‌ను మొదటగా EICMA 2024లో రిలీజ్ చేశారు. ఆ తరువాత ఇది పబ్లిక్ రోడ్లపై టెస్టింగ్‌లో కూడా కనిపించింది. ఈ బైక్‌ను భారత్‌లో ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. 3.91kWh లిథియమ్-అయాన్ బ్యాటరీతో ఇది వస్తుంది. కంపెనీ ప్రకారం, ఇది ఒకసారి చార్జ్ చేస్తే 154 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.
వివరాలు
బైక్ ఫీచర్లు ఇవే..
ఈ బైక్ 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని 4 సెకన్ల లోపులోనే అందుకోగలదు. ఫ్లయింగ్ ఫ్లీ C6లో పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంది. ఇది గరిష్టంగా 15.4kW శక్తిని, 60Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా వెనుక చక్రానికి చేరుతుంది. ఈ వ్యవస్థతో బైక్ 0-60 కిమీ/గం వేగాన్ని 3.7 సెకన్లలోనే చేరుతుంది. గరిష్ట వేగం 115 కిమీ/గం వరకు ఉంటుంది. కంపెనీ తెలిపిన ప్రకారం, ఈ బైక్‌ను పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 2 గంటల 16 నిమిషాలు పడుతుంది.
వివరాలు
మరిన్ని ఫీచర్లు..
ఫ్లయింగ్ ఫ్లీ C6 డిజైన్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలోని ఫ్లయింగ్ ఫ్లీ మోడల్ నుంచి ప్రేరణ పొందింది. ముందు భాగంలో ప్రత్యేకమైన గిర్డర్ ఫోర్క్ ఉంది. వెనుక భాగంలో 100/110మి.మీ ట్రావెల్ ఉన్న సాధారణ మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ బైక్ సీటు ఎత్తు 823 మి.మీ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 207 మి.మీ. బరువు 124 కిలోలుగా ఉండటంతో, తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకూ దీన్ని నడపడం సులభంగా ఉంటుంది.
వివరాలు
మార్కెట్లో పెరిగిన డిమాండ్..
ఈ బైక్ 19 ఇంచుల చక్రాలపై నడుస్తుంది. రెండు వైపులా 90-సెక్షన్ ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ఇవి సాధారణం కంటే కొంచెం సన్నగా ఉన్నప్పటికీ, రేంజ్ మెరుగుపడేందుకు సహాయపడతాయి. బ్రేకింగ్ కోసం ముందుభాగంలో 260 మి.మీ డిస్క్, వెనుక భాగంలో 220 మి.మీ డిస్క్ ఉన్నాయి. ఇవి లీన్-సెన్సిటివ్ డ్యూయల్-చానల్ ABSతో వస్తాయి. వెనుక ABSను ఆఫ్ చేయవచ్చు. అదనంగా ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కలిగిన రౌండ్ టచ్-ఎనేబుల్ TFT డిస్‌ప్లే ద్వారా నియంత్రించవచ్చు.