Tesla: టెస్లా FSD V14 Lite విడుదల.. పాత కార్లకు అధునాతన డ్రైవింగ్ అనుభవం
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా తన పాత మోడల్ కార్ల కోసం FSD V14 Lite సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఎంపిక చేసిన Hardware 3 వినియోగదారులకు విడుదల చేయడం ప్రారంభించింది. ఈ అప్‌డేట్ ద్వారా పాత టెస్లా కార్లలో డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త తరహా టెస్లా కార్లలో ఉన్న కొన్ని ఆధునిక ఫీచర్లను ఈ అప్‌డేట్ ద్వారా పాత వాహనాలకు అందిస్తోంది. అయితే, ఈ అప్‌డేట్ వచ్చినప్పటికీ కార్లు పూర్తిగా స్వయంచాలకంగా నడిచే సామర్థ్యాన్ని మాత్రం పొందవు.
వివరాలు
ఎలా పనిచేస్తుంది?
FSD V14 Lite అప్‌డేట్‌లో Hardware 4 కోసం రూపొందించిన డ్రైవింగ్ వ్యవస్థను Hardware 3 కార్లలో ఉన్న కెమెరాలు, కంప్యూటింగ్ వ్యవస్థకు అనుగుణంగా మార్చి ఉపయోగించారు. దీంతో పాత కంప్యూటర్ వ్యవస్థ కూడా కొత్త సాఫ్ట్‌వేర్ మార్గదర్శకత్వంలో వివిధ రహదారి పరిస్థితులను మెరుగ్గా అర్థం చేసుకుని స్పందించగలదు. టెస్లా విడుదల చేసిన వివరాల ప్రకారం, ఇందులో Reinforcement Learning, Offline Models వంటి ఆధునిక సాంకేతికతలను కూడా పాత వాహనాలకు తీసుకొచ్చారు.
వివరాలు
కొత్త ఫీచర్లు ఏమిటి?
ఈ అప్‌డేట్‌తో నావిగేషన్, రహదారుల కలయికలు, విడిపోతున్న మార్గాలు, పాదచారులతో వ్యవహరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గుర్తించడం, అకస్మాత్తుగా ఇతర వాహనాలు ముందుకు రావడం వంటి పరిస్థితుల్లో కారు మరింత సమర్థంగా స్పందిస్తుంది. అలాగే అవసరం లేని వేగం తగ్గింపులు తగ్గడం, స్టీరింగ్ మరింత సాఫీగా పనిచేయడం, లేన్ మధ్యలో వాహనం స్థిరంగా ప్రయాణించడం వంటి మెరుగుదలలు కూడా ఉంటాయని టెస్లా తెలిపింది. అంతేకాకుండా పార్కింగ్, పార్కింగ్ స్థలం నుంచి బయటకు రావడం, రివర్స్‌లో నడపడం వంటి కొత్త ఫీచర్లను కూడా ఇందులో చేర్చారు. Arrival Options అనే ఫీచర్ ద్వారా గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కారు ఎక్కడ పార్క్ చేయాలో డ్రైవర్ ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
వివరాలు
త్వరలో అందుబాటులోకి..
టెస్లా ఆటోపైలట్ విభాగాధిపతి అశోక్ ఎల్లుస్వామి ఈ అప్‌డేట్ గురించి ముందుగానే మాట్లాడుతూ, Hardware 4లో ఉన్న దాదాపు అన్ని ముఖ్యమైన ఫీచర్లను Hardware 3 వాహనాలకు కూడా అందించేలా దీనిని రూపొందించినట్లు తెలిపారు. ఫీచర్లను తగ్గించడం కాకుండా, న్యూరల్ నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా కుదించి రూపొందించామని చెప్పారు. ముఖ్యంగా ఈ అప్‌డేట్ వల్ల భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రారంభ వినియోగదారుల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా త్వరలోనే మరింత విస్తృతంగా ఈ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
ఇంకా ఉన్న పరిమితులు
అయితే ఈ అప్‌డేట్ వచ్చినప్పటికీ వాహనం పూర్తిగా డ్రైవర్ పర్యవేక్షణ లేకుండా నడిచే Unsupervised Full Self-Driving సామర్థ్యాన్ని పొందదు. Hardware 3తో తయారైన సుమారు 40 లక్షల టెస్లా వాహనాలకు ఇదే ప్రధాన పరిమితిగా ఉంది. పాత కంప్యూటర్ వ్యవస్థల్లో మెమరీ బ్యాండ్‌విడ్త్ పరిమితులు ఉండటంతో, ఈ వాహనాల్లో పూర్తి స్వయంచాలక డ్రైవింగ్‌ను అందించడం సాధ్యం కాదని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గతంలోనే స్పష్టం చేశారు.