Second-hand vehicles: సెకండ్ హ్యాండ్ వాహనం కొనే ముందు ఇది తప్పనిసరి.. కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసిన పోలీసులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల సెకండ్ హ్యాండ్ కార్లు, బైకులు కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త వాహనాల ధరలు పెరగడం, తక్కువ బడ్జెట్‌లో వాహనం సొంతం చేసుకోవాలనే ఆలోచనతో మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఎక్కువగా వాడిన వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్‌లో సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ కేంద్రాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ వ్యాపారులు అమాయక ప్రజలను మోసం చేస్తూ చోరీకి గురైన వాహనాలను విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన చోరీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, పాత వాహనాలు కొనుగోలు చేసే ప్రజలను మోసాల నుంచి రక్షించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు.
వివరాలు
చట్టపరమైన నిబంధనలు తప్పనిసరి
ఇటీవల పోలీసు శాఖ నిర్వహించిన 'ఆపరేషన్ కవచ్' ఆకస్మిక తనిఖీల్లో పలువురు సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారులు చట్టపరమైన నిబంధనలను పట్టించుకోకుండా వాహనాల కొనుగోలు, విక్రయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పాత వాహనాల వ్యాపారాన్ని క్రమబద్ధీకరించేందుకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. వాహన అసలు యజమాని వివరాలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా లేదా విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
వివరాలు
అధికారిక లైసన్సు తప్పనిసరి
ముఖ్యంగా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఓడోమీటర్ రీడింగ్‌లను మార్చడం, సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు ఫోటోలు, అవాస్తవ సమాచారంతో ప్రకటనలు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లేదా సంస్థ సంబంధిత ఆర్టీవో కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారిక లైసెన్సు పొందాలని సూచించారు.
వివరాలు
వ్యాపారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు
పాత వాహనాన్ని కొనుగోలు చేసే ముందు విక్రేతకు సంబంధించిన ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాల నకలును తప్పనిసరిగా సేకరించాలి. వాహనం ఆర్‌సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)లో ఉన్న పేరు, చిరునామా వివరాలను విక్రేత వివరాలతో సరిపోల్చి ధృవీకరించాలి. అసలు యజమాని కాకుండా బ్రోకర్లు లేదా ఇతరులు వాహనాన్ని విక్రయిస్తే, యజమాని ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ (POA) పత్రాలను పూర్తిగా పరిశీలించాలి. విక్రేత లేదా వాహన యజమాని వివరాలు అనుమానాస్పదంగా ఉంటే ఆ వాహనాన్ని స్టాక్‌లోకి తీసుకోవడం లేదా దానికి సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం పూర్తిగా నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు
వివరాలు
వాహనం కొనుగోలు ముందు తప్పనిసరిగా చేయాల్సిన తనిఖీలు
వాహనం కొనుగోలు చేసే ముందు అది దొంగిలించబడిందా, పోలీసుల బ్లాక్‌లిస్ట్‌లో ఉందా, గతంలో ఏదైనా ప్రమాదానికి గురైందా అనే వివరాలను అధికారిక 'వాహన్ పోర్టల్' ద్వారా పరిశీలించాలి. వాహనంపై పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, రోడ్డు పన్ను బకాయిలు, టోల్‌గేట్ బకాయిలు లేవని నిర్ధారించుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన వాహనాల విషయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తప్పనిసరిగా ఉండాలి. వాహనంలోని ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ వంటి గుర్తింపు వివరాలు ట్యాంపరింగ్‌కు గురైనా లేదా స్పష్టంగా కనిపించకపోయినా, అలాంటి వాహనాలను దొంగిలించినవిగా పరిగణించి పోలీసులు వెంటనే స్వాధీనం చేసుకుంటారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.