Triumph Tiger 900 Alpine: భారత్‌లోకి ట్రయంఫ్ కొత్త అడ్వెంచర్ బైక్స్.. టైగర్ 900 ఆల్పైన్, డెజర్ట్ ఎడిషన్స్ ధరలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లో తన ప్రీమియం అడ్వెంచర్ బైక్ శ్రేణిని మరింత విస్తరించింది. కంపెనీ తాజాగా ట్రయంఫ్ టైగర్ 900 ఆల్పైన్ ఎడిషన్, ట్రయంఫ్ టైగర్ 900 డెసర్ట్ ఎడిషన్ పేర్లతో రెండు కొత్త స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ట్రయంఫ్ టైగర్ 900 ఆల్పైన్ ఎడిషన్ ధర రూ.15.35 లక్షలు కాగా, ట్రయంఫ్ టైగర్ 900 డెజర్ట్ ఎడిషన్ ధర రూ.16.05 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. ఈ రెండు కొత్త స్పెషల్ ఎడిషన్ బైక్‌లలో ప్రత్యేక పెయింట్ స్కీమ్స్, ఫ్యాక్టరీ ఫిట్ చేసిన యాక్సెసరీస్, అలాగే టూరింగ్ మరియు ఆఫ్-రోడింగ్‌కు అనుకూలమైన ఫీచర్లను అందించారు.
వివరాలు
ట్రయంఫ్ టైగర్ 900 ఆల్పైన్ ఎడిషన్: డిజైన్, ఫీచర్లు
ట్రయంఫ్ టైగర్ 900 ఆల్పైన్ ఎడిషన్ GT ప్రో వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ముఖ్యంగా హైవేలు, టార్మాక్ రోడ్లపై ఎక్కువగా ప్రయాణించే టూరింగ్ రైడర్లను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తీసుకొచ్చారు. ఈ బైక్‌కు స్నోడోనియా వైట్, సఫైర్ బ్లాక్ కలర్ స్కీమ్‌తో పాటు బ్లూ యాక్సెంట్స్‌ను జోడించారు. దీంతో బైక్ మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. కాస్మెటిక్ మార్పులతో పాటు ఫ్యాక్టరీ ఫిట్ చేసిన ఇంజిన్ ప్రొటెక్షన్ బార్స్, అక్రాపోవిక్ ఎగ్జాస్ట్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. దీని వల్ల టూరింగ్ కంఫర్ట్ మెరుగుపడటంతో పాటు స్పోర్టీ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా లభిస్తుందని ట్రయంఫ్ వెల్లడించింది. అలాగే TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లతో ఈ బైక్‌ను నవీకరించారు.
వివరాలు
ట్రయంఫ్ టైగర్ 900 డెజర్ట్ ఎడిషన్: హార్డ్‌వేర్
ట్రయంఫ్ టైగర్ 900 డెసర్ట్ ఎడిషన్ ర్యాలీ ప్రో వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ మోడల్ మరింత రగ్గడ్, అడ్వెంచర్ ఫోకస్‌తో కనిపిస్తుంది. ఈ బైక్‌లో బాజా ఆరెంజ్ హైలైట్స్‌తో పాటు అదనపు ప్రొటెక్షన్ పరికరాలు, అడ్వెంచర్ స్టైలింగ్ ఎలిమెంట్స్‌ను అందించారు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ ప్రొటెక్షన్ బార్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, అక్రాపోవిక్ సైలెన్సర్‌ను కూడా అమర్చారు. ఈ బైక్ ముందు భాగంలో 21అంగుళాల వీల్, వెనుక భాగంలో 17 అంగుళాల వీల్ సెటప్‌ను ఉపయోగించారు. దీని వల్ల ఆఫ్-రోడింగ్ సామర్థ్యం మరింత మెరుగుపడింది. విశేషమేమిటంటే, అదనపు యాక్సెసరీస్, ప్రత్యేక స్టైలింగ్ అప్‌డేట్స్ ఉన్నప్పటికీ, ట్రయంఫ్ టైగర్ 900డెజర్ట్ ఎడిషన్ ధర స్టాండర్డ్ ర్యాలీ ప్రో కంటే రూ.10,000 తక్కువగా నిర్ణయించారు.
వివరాలు
ఇంజిన్, పనితీరు
ఈ రెండు మోడళ్లకూ ట్రయంఫ్‌కు చెందిన 888cc లిక్విడ్ కూల్డ్ ఇన్‌లైన్ త్రీ సిలిండర్ T-Plane ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 9,500 rpm వద్ద 108 హార్స్ పవర్, 6,850 rpm వద్ద 90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను స్టాండర్డ్‌గా జత చేశారు. అదనంగా ప్రీమియం సస్పెన్షన్ హార్డ్‌వేర్, ఆధునిక రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లను కూడా కొనసాగించారు.