TVS: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 125 సీసీ...ఫీచర్లు అదిరిపోయాయ్ గురూ
ఈ వార్తాకథనం ఏంటి
125 సీసీ బైక్ అంటే సాధారణంగా రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడే మోడల్‌గానే చాలామంది భావిస్తారు. కానీ ఆ ఆలోచనను మార్చేలా TVS Motor Company కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న EICMA 2026 వేదికగా Apache RTR 125 LCను ఆవిష్కరించింది. స్పోర్టీ స్ట్రీట్‌ఫైటర్ లుక్‌తో పాటు శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక డిజిటల్ ఫీచర్లను ఇందులో పొందుపరిచింది. ముఖ్యంగా 5 అంగుళాల TFT డిస్‌ప్లే, 6-స్పీడ్ గేర్‌బాక్స్ వంటి ప్రత్యేకతలు ఈ బైక్‌ను 125 సీసీ విభాగంలో ఆకర్షణీయమైన మోడల్‌గా నిలబెడుతున్నాయి.
Details
14.9 PS పవర్.. 6-స్పీడ్ గేర్‌బాక్స్
ఈ బైక్‌లో 125cc, 4-వాల్వ్, DOHC లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 14.9 PS పవర్, 12 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వల్ల క్లచ్ ఆపరేషన్ సులభంగా ఉండటంతో పాటు వేగంగా గేర్లు తగ్గించే సమయంలో మెరుగైన నియంత్రణ లభిస్తుంది.
రైడింగ్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే వాటి పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Details
స్ట్రీట్‌ఫైటర్ లుక్.. ఆకట్టుకునే డిజైన్
డిజైన్ విషయంలో Apache RTR 125 LCకు ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చారు.
మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ ట్యాంక్ ష్రౌడ్స్, ఎక్స్‌పోజ్డ్ ట్రెల్లిస్ ఫ్రేమ్ బైక్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి.
మెటాలిక్ సిల్వర్ కలర్‌పై ఫ్లోరోసెంట్ ఎల్లో హైలైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముందు భాగంలో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, DRL ఉండగా, వెనుకవైపు ట్రై-స్ప్లిట్ LED టెయిల్ ల్యాంప్ ఇచ్చారు.
స్ప్లిట్ సీట్, హ్యాండ్‌గార్డ్స్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్ కూడా దీని స్పోర్టీ రూపాన్ని మరింత పెంచుతున్నాయి.
Details
సేఫ్టీకి ప్రాధాన్యం.. డ్యూయల్ ఛానల్ ABS
రైడింగ్ నియంత్రణ కోసం ముందు భాగంలో 41mm KYB USD ఫోర్క్స్, వెనుకవైపు అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అందించారు.
బ్రేకింగ్ కోసం ముందు 300mm, వెనుక 240mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి. వీటికి ByBre కాలిపర్లు, డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ జత చేశారు.
17 అంగుళాల అలాయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ హార్డ్‌వేర్ సెటప్ వల్ల మలుపుల్లో, బ్రేకింగ్ సమయంలో రైడర్‌కు మెరుగైన నియంత్రణ అందించాలన్నది కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.
Details
భారత్‌లో లాంచ్ ఎప్పుడు?
టెక్నాలజీ పరంగా కూడా ఈ బైక్ ముందుంది. 5 అంగుళాల TFT స్క్రీన్‌కు బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు.
ఫుల్ స్క్రీన్ మ్యాప్ మిర్రరింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్ ద్వారా ప్రయాణంలో రూట్ వివరాలను డిస్‌ప్లేపైనే చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మోడల్‌ను యూరోపియన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఆవిష్కరించారు.
భారత్‌లో లాంచ్ తేదీ, ధరపై TVS ఇంకా ప్రకటన చేయలేదు. 2027 జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
అయితే భారత మార్కెట్లోకి వస్తుందా? వస్తే ఏ ధరలో అందుబాటులోకి వస్తుంది? అనేది వేచి చూడాలి.