Loading...
VinFast Denies: భారత్‌లో VF6, VF7 ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లింగ్ ఆపలేదు.. ఉత్పత్తిపై విన్ఫాస్ట్ కీలక ప్రకటన
భారత్‌లో VF6, VF7 ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లింగ్ ఆపలేదు.. ఉత్పత్తిపై విన్ఫాస్ట్ కీలక ప్రకటన

VinFast Denies: భారత్‌లో VF6, VF7 ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లింగ్ ఆపలేదు.. ఉత్పత్తిపై విన్ఫాస్ట్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Moogati Shabari
Sep 02, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో VF 6, VF 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ఉత్పత్తి ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదని వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ స్పష్టం చేసింది. భారత్‌లో స్థానిక తయారీకి సంబంధించి ప్రణాళికలను మార్చినట్లు వచ్చిన వార్తలను కంపెనీ ఖండించింది. తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌లో పూర్తిగా విడిభాగాల రూపంలో దిగుమతి చేసుకునే CKD (Completely Knocked Down) కిట్లతో VF 6, VF 7 వాహనాల అసెంబ్లింగ్ కొనసాగుతుందని వెల్లడించింది. భారత్‌లో స్థానిక తయారీ ప్రణాళికలపై కంపెనీ సమీక్ష నిర్వహిస్తోందంటూ రాయిటర్స్‌ కథనం ప్రచురించిన నేపథ్యంలో విన్ఫాస్ట్ ఈ ప్రకటన చేసింది.

వివరాలు

ఖర్చులను సమీక్షించే క్రమంలో..

ఖర్చులను సమీక్షించే క్రమంలో మూడు ఎలక్ట్రిక్ వాహన ప్రాజెక్టులకు సంబంధించిన స్థానిక తయారీ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కంపెనీ అంతర్గత మెమో, సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ పేర్కొంది.

అయితే ఆ కథనంలో ప్రస్తావించిన ప్రతి ప్రాజెక్టు పరిస్థితిపై విన్ఫాస్ట్ నేరుగా వివరణ ఇవ్వలేదు.

ప్రస్తుతం భారత్‌లో విక్రయిస్తున్న మోడళ్లపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

"ప్రస్తుతం భారత్‌లో విక్రయిస్తున్న మోడళ్ల ఉత్పత్తి ప్రణాళికల్లో విన్ఫాస్ట్ ఎలాంటి మార్పు చేయలేదు లేదా నిలిపివేయలేదు" అని కంపెనీ తెలిపింది.

దేశీయ మార్కెట్ కోసం తూత్తుకుడి ప్లాంట్‌లో VF 6, VF 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను CKD విధానంలో అసెంబ్లింగ్ చేయడం కొనసాగుతుందని పేర్కొంది.

వివరాలు

తయారీ వ్యూహంలో కీలకమైన మార్కెట్..

CKD అసెంబ్లింగ్ విధానంలో వాహనాన్ని విడివిడిగా ఉండే భాగాల రూపంలో దిగుమతి చేసుకుని, వాటిని స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తారు.

దీంతో భవిష్యత్ తయారీ, స్థానికీకరణకు సంబంధించిన ప్రణాళికలపై వచ్చిన వార్తలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న VF 6, VF 7 వాహనాల విక్రయాలు, అసెంబ్లింగ్‌పై ప్రభావం చూపబోవని కంపెనీ ప్రకటన స్పష్టం చేస్తోంది.

భారత్ తమ దీర్ఘకాలిక వ్యాపార, తయారీ వ్యూహంలో కీలకమైన మార్కెట్ అని విన్ఫాస్ట్ తెలిపింది.

భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకునేందుకు మార్కెట్ అధ్యయనాలు, కస్టమర్ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

ముఖ్యంగా VF 6, VF 7 మోడళ్లకు సంబంధించి వినియోగదారుల నుంచి వచ్చిన అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

సప్లయర్ కాన్ఫరెన్స్‌లకు 300 మందికి పైగా భారతీయ సరఫరాదారులు..

భారత మార్కెట్‌కు అనుగుణంగా ఉత్పత్తుల్లో మార్పులు చేసేందుకు ఈ ఫీడ్‌బ్యాక్ ఉపయోగపడిందని కంపెనీ పేర్కొంది.

భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్ల విషయంలో కేవలం తమ గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలోని వాహనాలను భారత్‌లోకి తీసుకురావడం మాత్రమే తమ ఉద్దేశం కాదని విన్ఫాస్ట్ తెలిపింది.

భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వాహనాలను డిజైన్ చేసి, అభివృద్ధి చేసి, తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.

అదే సమయంలో వాహనాల్లో స్థానికంగా తయారయ్యే భాగాల వినియోగాన్ని మరింత పెంచే దిశగా పనిచేస్తున్నట్లు తెలిపింది.

భారత్, వియత్నాంలో విన్ఫాస్ట్ నిర్వహించిన సప్లయర్ కాన్ఫరెన్స్‌లకు 300 మందికి పైగా భారతీయ సరఫరాదారులు పాల్గొన్నారని కంపెనీ తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

ప్లాంట్ విస్తరణ.. పెరుగుతున్న అమ్మకాలు..

తూత్తుకుడి ప్లాంట్ విస్తరణలో రెండో దశకు ఇటీవల విన్ఫాస్ట్ పెట్టుబడి అనుమతి పొందింది.

భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ఇది కీలక అడుగుగా కంపెనీ భావిస్తోంది.

2025 సెప్టెంబర్‌లో భారత్‌లో వాహనాల డెలివరీలను ప్రారంభించిన తర్వాత విన్ఫాస్ట్ అమ్మకాలు వేగంగా పెరిగాయని కంపెనీ తెలిపింది.

2026 తొలి ఆరు నెలల్లో మొత్తం 5,627 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది.

దీంతో భారత్‌లో తమ మార్కెట్ వాటా 3.8 శాతంగా ఉందని కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టులో విన్ఫాస్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు 2,196 యూనిట్లకు చేరాయి.

జూలైలో నమోదైన 1,530 యూనిట్లతో పోలిస్తే నెలవారీగా 43.5 శాతం వృద్ధి నమోదైంది.

ఇప్పటివరకు మొత్తం అమ్మకాలు 10,415 యూనిట్లను దాటినట్లు కంపెనీ తెలిపింది.

ADVERTISEMENT