Volkswagen-JSW Group: భారత్‌లో వ్యాపారం విస్తరణకు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో వోక్స్‌వ్యాగన్ చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
వోక్స్‌వ్యాగన్ భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పరిశీలిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఉన్న భారత్‌లో పోటీ సామర్థ్యాన్ని, లాభదాయకతను పెంచుకోవడమే ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా సంస్థ ప్రతినిధి బుధవారం తెలిపారు. భారత్‌లో వోక్స్‌వ్యాగన్ వాహనాల సంఖ్యను పెంచడం, స్థానికంగా విడిభాగాలు, ఇతర సామగ్రిని ఎక్కువగా కొనుగోలు చేయడం, తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలు ప్రతిపాదిత భాగస్వామ్యంలో కీలకంగా ఉండనున్నాయి. భారత మార్కెట్లో తన ఉనికిని పెంచుకునేందుకు వోక్స్‌వ్యాగన్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది.
వివరాలు
కార్ల మార్కెట్లో బలం పెంచుకునేందుకు వోక్స్‌వ్యాగన్ అడుగులు
యూరప్ వెలుపల వ్యాపారాన్ని విస్తరించాలన్న జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ వ్యూహంలో భారత్‌కు కీలక స్థానం ఉంది.
అయితే, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత కార్ల మార్కెట్లో అంతర్జాతీయ వాహన సంస్థలు పోటీని ఎదుర్కొంటున్న పరిస్థితిని ఈ పరిణామం కూడా తెలియజేస్తోంది.
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఉక్కు నుంచి ఇంధన రంగం వరకు విస్తరించిన భారతీయ వ్యాపార సంస్థ. 2023లో ఇది ప్రయాణికుల కార్ల విభాగంలోకి అడుగుపెట్టింది.
చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ మోటార్‌తో కలిసి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఎంజీ బ్రాండ్ పేరుతో కార్లను విక్రయిస్తోంది.
వివరాలు
మార్కెట్ వాటా పెంచుకునేందుకు వోక్స్‌వ్యాగన్ కొత్త వ్యూహం
ప్రతిపాదిత భాగస్వామ్యం రెండు సంస్థల మధ్య ఉమ్మడి నియంత్రణతో ఉండే అవకాశం ఉంది.
కార్యకలాపాల బాధ్యతలను స్పష్టంగా విభజించడం,కీలక నిర్ణయాలను వేగంగా తీసుకునేలా నిర్వహణ విధానాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇందులో ఉండనున్నట్లు వోక్స్‌వ్యాగన్ ప్రతినిధి తెలిపారు.
వాహనాల తయారీలో ఉపయోగించే ప్లాట్‌ఫామ్‌లను పరస్పరం వినియోగించుకోవడం, స్థానిక కొనుగోళ్లను పెంచడం,ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం వంటి మార్గాలపైనా రెండు సంస్థలు దృష్టి పెట్టనున్నాయి.
భారత్‌లో వోక్స్‌వ్యాగన్‌కు స్కోడా ఆటో కార్యకలాపాలను ముందుండి నడిపిస్తోంది.
దేశంలో రెండు దశాబ్దాలకు పైగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ, వోక్స్‌వ్యాగన్ మార్కెట్ వాటా ప్రస్తుతం సుమారు 2 శాతానికే పరిమితమైంది.
దీంతో స్థానికంగా తయారీ, విడిభాగాల కొనుగోళ్లు పెంచడం ద్వారా ఖర్చులను తగ్గించుకుని పోటీ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని సంస్థ చూస్తోంది.
వివరాలు
రూ.12 వేల కోట్ల పన్ను వివాదంలో వోక్స్‌వ్యాగన్..
ఇదిలా ఉండగా, 2024లో వోక్స్‌వ్యాగన్‌కు భారత అధికారులు సుమారు 1.4 బిలియన్ డాలర్ల పన్ను డిమాండ్ నోటీసు జారీ చేశారు.
దిగుమతి పన్నులను తప్పించుకుందని అధికారులు ఆరోపించారు.
అయితే, తాము భారత చట్టాలు, నిబంధనలను పూర్తిగా పాటించామని చెబుతూ వోక్స్‌వ్యాగన్ ఈ నిర్ణయాన్ని సవాలు చేసింది.
ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఇంకా తీర్పు ఇవ్వాల్సి ఉంది.
మరోవైపు చైనా వాహన తయారీ సంస్థలు యూరప్‌లో విస్తరిస్తుండటంతో వోక్స్‌వ్యాగన్‌పై ఖర్చులను తగ్గించి పోటీ సామర్థ్యాన్ని పెంచాలన్న ఒత్తిడి పెట్టుబడిదారుల నుంచి పెరుగుతోంది.
మరో ముఖ్యమైన మార్కెట్ అయిన చైనాలో అమ్మకాల మందగమనం కొనసాగుతుండటం, అంతర్జాతీయంగా సుంకాల ఒత్తిళ్లు ఉండటం కూడా సంస్థకు సవాళ్లుగా మారాయి.