Volkswagen Golf GTI 1976: వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI 1976 - మాన్యువల్ గేర్‌తో స్పెషల్ ట్రీట్
ఈ వార్తాకథనం ఏంటి
వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIకి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఓ ప్రత్యేక మోడల్‌ను తీసుకొచ్చింది. Golf GTI 1976 పేరుతో వస్తున్న ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను కేవలం 1,976 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. 2027 తొలి త్రైమాసికంలో యూరప్ మార్కెట్లోకి రానున్న ఈ కారు తయారీ జర్మనీలోని వోల్ఫ్స్‌బర్గ్ ప్లాంట్‌లో మొదలవుతుంది. అయితే దీని అసలు ఆకర్షణ డిజైన్ కంటే డ్రైవింగ్ అనుభూతిలోనే ఉంది. ప్రస్తుత GTI లైనప్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఏకైక మోడల్ ఇదే కావడం విశేషం.
Details
325 హెచ్‌పీతో మాన్యువల్ పవర్
గోల్ఫ్ GTI 1976లో 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 325 హెచ్‌పీ పవర్, 380 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పవర్ పరంగా ఇది Golf GTI Edition 50తో సమానంగా ఉండగా, ప్రస్తుత Golf GTI Clubsport కంటే 24 హెచ్‌పీ ఎక్కువ.
అయితే మాన్యువల్ గేర్‌బాక్స్ సామర్థ్యం కారణంగా టార్క్‌ను 420 ఎన్ఎం నుంచి 380 ఎన్ఎంకు పరిమితం చేశారు. అంటే డ్రైవర్ స్వయంగా గేర్ మార్చుకునే అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చారన్నమాట.
Details
GTI అభిమానుల కోరికే కారణం
ఈ స్పెషల్ ఎడిషన్ వెనుక ఉన్న ఆలోచన కూడా ఆసక్తికరంగానే ఉంది. ఎక్కువ పవర్‌తో పాటు మాన్యువల్ గేర్‌బాక్స్ కావాలని GTI అభిమానుల నుంచి వచ్చిన అభ్యర్థనలకు స్పందిస్తూ ఈ మోడల్‌ను రూపొందించినట్లు వోక్స్‌వ్యాగన్ తెలిపింది.
కారు నడిపేటప్పుడు డ్రైవర్-కారు మధ్య మరింత ప్రత్యక్ష అనుభూతి రావాలనే ఉద్దేశంతో ఈ కాంబినేషన్‌ను తీసుకొచ్చారు.
కేవలం సంఖ్యల పరంగా చూస్తే ఇది మరో GTIలా కనిపించినా, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారణంగా ప్రస్తుత లైనప్‌లో దీనికి ప్రత్యేక స్థానం దక్కింది.
Details
నూర్బర్గ్‌రింగ్ కోసం ప్రత్యేక ఛాసిస్
డ్రైవింగ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు Golf GTI 1976లో అడాప్టివ్ ఛాసిస్ కంట్రోల్ (DCC), ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఫ్రంట్ డిఫరెన్షియల్ లాక్, ప్రోగ్రెసివ్ స్టీరింగ్‌ను స్టాండర్డ్‌గా అందించారు.
Clubsport నుంచి తీసుకున్న స్పెషల్ డ్రైవింగ్ ప్రొఫైల్ కూడా ఉంది. ఇది పవర్‌ట్రెయిన్, స్టీరింగ్, DCC సెట్టింగులను నూర్బర్గ్‌రింగ్ నార్డ్‌ష్లైఫే ట్రాక్‌కు అనుగుణంగా మార్చుతుంది.
అదనంగా Performance Package ఎంచుకుంటే టైటానియం టెయిల్‌పైప్స్‌తో తేలికైన R-Performance ఎగ్జాస్ట్, 19-అంగుళాల Warmenau ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.
Details
బయట డిజైన్‌లోనూ 1976 టచ్
ఈ కారు బయట నుంచి చూసిన వెంటనే ఇది సాధారణ GTI కాదని గుర్తించేలా మార్పులు చేశారు. ముందు స్ప్లిటర్‌పై రెడ్ స్ట్రిప్, 'GTI 1976' లెటరింగ్, రూఫ్ స్పాయిలర్‌పై ప్రత్యేక గ్రాఫిక్స్ ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్ మిర్రర్లకు గ్లోస్ బ్లాక్ కవర్లు ఇచ్చారు. ముందు, వెనుక వోక్స్‌వ్యాగన్ బ్యాడ్జ్‌లతో పాటు వెనుక సైడ్ విండోస్‌పై ఉన్న బ్యాడ్జ్‌లను కూడా డార్క్ చేశారు.
స్టాండర్డ్‌గా 19-అంగుళాల Queenstown అల్లాయ్ వీల్స్ వస్తాయి. Pure White, Grenadilla Black Metallic, Tornado Red అనే మూడు రంగుల్లో ఇది లభిస్తుంది.
Details
లోపలికి వెళ్తే అసలు స్పెషల్ టచ్
ఇంటీరియర్‌లోనూ పాత గోల్ఫ్ GTI జ్ఞాపకాలను గుర్తుచేసే అంశాలను జోడించారు. ముఖ్యంగా గోల్ఫ్ బాల్ ఆకారంలో ఉన్న గేర్ నాబ్ ఒరిజినల్ GTIకి నివాళిగా నిలుస్తుంది.
కొత్త డిజైన్ GTI స్పోర్ట్స్ సీట్లు, బయట సీట్లకు రెడ్ సీట్ బెల్ట్‌లు, రెడ్ యాక్సిలరేటర్ పెడల్, ArtVelours ఫినిషింగ్‌తో మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.
డ్యాష్‌బోర్డ్, ముందు డోర్ ట్రిమ్స్‌పై కార్బన్ ఫినిష్ డెకరేటివ్ ఇన్‌సర్ట్స్ ఇచ్చారు. ప్రతి కారులో 'ONE OF 1976' అని ఉన్న ప్రత్యేక ఇంటీరియర్ ప్లాక్ ఉంటుంది.
మొత్తం మీద ఇది 50 ఏళ్ల GTI చరిత్రను గుర్తు చేస్తూనే, మాన్యువల్ డ్రైవింగ్ ఇష్టపడే వారికి ప్రత్యేకంగా నిలిచే మోడల్‌గా కనిపిస్తోంది.