HMDA Land Auction: రూ.120 కోట్ల భూమికి బిడ్ కరువు.. హెచ్‌ఎండీఏకు షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత విలువైన రెండు కీలక భూముల ఈ-వేలానికి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో అధికారులు ప్రక్రియను రద్దు చేశారు. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్, మూసాపేటలోని ఈ భూములను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరోసారి వేలం వేయాలని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది.
వివరాలు
రూ.120 కోట్ల ధర పెట్టినా.. స్పందన కరువు
కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లోని 4.59 ఎకరాల (ప్లాట్ నంబర్ 17) భూమికి ఎకరాకు రూ.120 కోట్లు, కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేటలో 3.15 ఎకరాల స్థలానికి ఎకరాకు రూ.99 కోట్లుగా హెచ్‌ఎండీఏ కనీస ధర (అప్‌సెట్ ప్రైస్) నిర్ణయించింది.
శుక్రవారం నిర్వహించిన ఈ-వేలంలో పాల్గొనేందుకు ఒక్క సంస్థ లేదా వ్యక్తి కూడా ముందుకు రాలేదు. దీంతో వేలం ప్రక్రియను రద్దు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.
వివరాలు
అధిక ధరలే కారణమా?
కనీస ధరలు భారీగా ఉండటమే బిడ్డర్లు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నియోపోలిస్ ప్లాట్‌కు ఎకరాకు రూ.99 కోట్లు, మూసాపేట భూమికి రూ.80 కోట్ల వరకు ధర నిర్ణయిస్తే బాగుండేదని పెట్టుబడిదారులు భావించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇదే కోకాపేట ప్లాట్‌ను 2026 సెప్టెంబర్‌లోనూ ఎకరాకు రూ.120 కోట్ల ధరతో వేలానికి ఉంచారు.
అప్పట్లో కూడా కేవలం ఒక్కరే బిడ్ వేయడంతో ఆ ప్రక్రియను రద్దు చేసిన విషయం తెలిసిందే.
వివరాలు
మూసాపేట భూములపై హైకోర్టులో పిటిషన్లు
మూసాపేటలోని సర్వే నంబర్ల వివాదానికి సంబంధించి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓ ట్రక్ అసోసియేషన్‌తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.
అయితే వేలంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో హెచ్‌ఎండీఏ వేలం ప్రక్రియను కొనసాగించింది.
అయినప్పటికీ బిడ్డర్ల నుంచి స్పందన రాలేదు. అంతకుముందు గురువారం బంజారాహిల్స్‌లోని 8 హుడా లేఅవుట్ ప్లాట్ల వేలానికి కూడా ఒక్క బిడ్ దాఖలు కాలేదు.
వివరాలు
చిన్న ప్లాట్ల వేలానికి మాత్రం మంచి స్పందన
అయితే ఈ పరిణామాలను రియల్ ఎస్టేట్ రంగంలో పూర్తిస్థాయి మందగమనానికి సంకేతంగా చూడకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల హెచ్‌ఎండీఏ నిర్వహించిన చిన్న, మధ్య తరహా ప్లాట్ల వేలం విజయవంతమైంది. బాచుపల్లిలో 50 ప్లాట్లకు గాను 35 విక్రయమై రూ.48.31 కోట్ల ఆదాయం వచ్చింది.
అమీన్‌పూర్‌లో 8 ప్లాట్లలో 5 అమ్ముడవగా రూ.28.28 కోట్లు సమకూరాయి. ఇమ్ముల్నర్వలో 30 ప్లాట్లకు గాను 12 విక్రయమై రూ.4.5 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది.
గతంలో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ భూముల వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిన సంగతి తెలిసిందే.