Loading...
Pakistan Space Capabilities: చైనా సాయంతో పాక్‌కు అంతరిక్ష బలం.. భారత్‌కు సీడీఎస్ హెచ్చరిక!
చైనా సాయంతో పాక్‌కు అంతరిక్ష బలం.. భారత్‌కు సీడీఎస్ హెచ్చరిక!

Pakistan Space Capabilities: చైనా సాయంతో పాక్‌కు అంతరిక్ష బలం.. భారత్‌కు సీడీఎస్ హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా సహకారంతో పాకిస్థాన్ తన అంతరిక్ష సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటోందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి హెచ్చరించారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ కూడా అంతరిక్ష, నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన 'ఫ్యూచర్ ఆఫ్ వార్‌ఫేర్' సదస్సులో ఆయన మాట్లాడారు. చైనా తన ఉపగ్రహ నిఘా, గూఢచర్య, నావిగేషన్ సాంకేతికతను పాకిస్థాన్‌కు అందుబాటులోకి తెస్తోందని, ఈ రెండు దేశాలకు టర్కీ కూడా సహకరించే అవకాశం ఉందని భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వివరాలు

52 నిఘా ఉపగ్రహాల ప్రయోగం

ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత అంతరిక్ష నిఘా వ్యవస్థ ఫేజ్-3 (ఎస్‌బీఎస్-3) కీలక పాత్ర పోషిస్తుందని సీడీఎస్ తెలిపారు.

రూ.26,968 కోట్ల వ్యయంతో సరిహద్దులు, హిందూ మహాసముద్ర పరిధిపై నిఘా ఉంచేందుకు 52 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు వివరించారు.

చైనాతో పోటీపడి ఆయుధ పోటీలోకి దిగాల్సిన అవసరం లేదని, దేశ సరిహద్దుల రక్షణకు అవసరమైన సామర్థ్యాలను మాత్రమే పెంచుకోవాలని స్పష్టం చేశారు.

నావిక్, ఎస్‌బీఎస్-3, జీశాట్-7 వ్యవస్థలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు.

వివరాలు

త్వరలో సైన్యంలోకి లేజర్ ఆయుధాలు

డ్రోన్ల దాడులను సమర్థంగా అడ్డుకునేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన లేజర్, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ (డీఈడబ్ల్యూ)ను త్వరలోనే సైన్యంలోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఆయుధాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సవరించిన రక్షణ సేకరణ విధానం (డీఏపీ) ముసాయిదాను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్లు చెప్పారు.

భవిష్యత్ యుద్ధాల్లో నిఘా వ్యవస్థల ప్రాధాన్యం గణనీయంగా పెరిగిపోయిందని జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి పేర్కొన్నారు.

సైబర్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విభాగాలను ఆధునికీకరించడంతో పాటు.. సంయుక్త సైనిక చర్యలకు అనుగుణంగా బలగాలు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.

ADVERTISEMENT