LOADING...
US Man Who Won Lottery: 18 సార్లు లాటరీ విన్.. 'నా భార్యే నా అసలైన అదృష్టం' అన్న లక్కీ మ్యాన్
18 సార్లు లాటరీ విన్.. 'నా భార్యే నా అసలైన అదృష్టం' అన్న లక్కీ మ్యాన్

US Man Who Won Lottery: 18 సార్లు లాటరీ విన్.. 'నా భార్యే నా అసలైన అదృష్టం' అన్న లక్కీ మ్యాన్

వ్రాసిన వారు Moogati Shabari
May 16, 2026
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొంతమంది జీవితాల్లో అదృష్టం అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తుంది. కానీ అమెరికాకు చెందిన రాబర్ట్ బెవాన్ జీవితంలో మాత్రం అదృష్టం ఎప్పటికప్పుడు తలుపుతడుతోంది. ఏకంగా 18 సార్లు లాటరీ గెలిచి ఆయన అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది లాటరీ విజయాలు మాత్రమే కాదు.. తన జీవితంలోని నిజమైన అదృష్టం గురించి చెప్పిన మాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

వివరాలు

18వసారి కూడా లాటరీ విజయం..

ఇడాహో లాటరీ నిర్వహించిన "1,000,000 డాలర్ల కింగ్ స్క్రాచ్ గేమ్"లో రాబర్ట్ బెవాన్ మరోసారి విజేతగా నిలిచారు. దీంతో ఆయన మొత్తం 18 సార్లు లాటరీ గెలిచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఒకే వ్యక్తి ఇంతసార్లు విజయం సాధించడం చూసి ఇడాహో లాటరీ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడిస్తూ, "ఒక్కరే 18 సార్లు గెలవడం నిజంగా ఆశ్చర్యకరం" అని పేర్కొన్నారు. పాత రికార్డులు పరిశీలించిన తర్వాత రాబర్ట్ చాలాకాలంగా వరుసగా విజేతగా నిలుస్తున్నారని అధికారులు గుర్తించారు.

వివరాలు

1997 నుంచే మొదలైన అదృష్ట యాత్ర..

రాబర్ట్ లాటరీ విజయాల ప్రయాణం కొత్తది కాదు. 1997లో ఇడాహో లాటరీ నిర్వహించిన "బ్లేజర్ బక్స్" ప్రచార కార్యక్రమంలో ఆయన తొలిసారి లగ్జరీ చేవ్రొలెట్ బ్లేజర్ కారును గెలుచుకున్నారు. అప్పటి నుంచి వివిధ లాటరీల ద్వారా 1,000 డాలర్ల నుంచి 2 లక్షల డాలర్ల వరకు అనేక బహుమతులు అందుకున్నారు. ఇటీవల బహుమతి నగదు స్వీకరించడానికి లాటరీ కార్యాలయానికి వచ్చిన రాబర్ట్‌ను అధికారులు, "మీ విజయ రహస్యం ఏమిటి?" అని అడిగారు. అందుకు ఆయన ఇచ్చిన సమాధానం అందరి హృదయాలను తాకింది. "లాటరీల్లో గెలుచుకున్న డబ్బు కాదు.. గత 40 ఏళ్లుగా ప్రతి సంతోషంలోనూ, ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా ఉన్న నా భార్యే నా అసలైన జాక్‌పాట్." అని భావోద్వేగంగా చెప్పారు.

Advertisement

వివరాలు

వ్యసనంగా కాదు.. వినోదంగా మాత్రమే..

లాటరీలపై చాలా మంది అధికంగా ఆధారపడుతూ జీవితాలను ఇబ్బందుల్లో పడేస్తుంటారు. కానీ రాబర్ట్ దంపతులు మాత్రం దీన్ని కేవలం ఒక వినోదంగా మాత్రమే తీసుకున్నారు. డబ్బు ఆనందాన్ని ఇవ్వొచ్చు కానీ, అదే జీవితంలో ముఖ్యమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే తాము కొనుగోలు చేసే లాటరీ టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో పెద్ద భాగం ప్రభుత్వ పాఠశాలలు, ప్రజా భవనాల అభివృద్ధికి ఉపయోగపడుతుందనే సంతృప్తి కూడా తమకు ఉందని తెలిపారు.

Advertisement

వివరాలు

సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ..

కుటుంబ బంధాలు డబ్బుకంటే విలువైనవని చెప్పిన రాబర్ట్ మాటలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. "డబ్బు సంపాదించినవాడే మిలియనీర్ కాదు.. ఇలాంటి గొప్ప మనసున్నవారే నిజమైన ధనవంతులు" అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. రాబర్ట్ బెవాన్ కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే — జీవితంలో ప్రేమతో, అండగా నిలిచే భాగస్వామి ఉండటం కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు.

Advertisement