LOADING...
Meta: ఉద్యోగాల కోతకు సిద్ధమైన మెటా.. 7 వేల మందికి కొత్త బాధ్యతలు
ఉద్యోగాల కోతకు సిద్ధమైన మెటా.. 7 వేల మందికి కొత్త బాధ్యతలు

Meta: ఉద్యోగాల కోతకు సిద్ధమైన మెటా.. 7 వేల మందికి కొత్త బాధ్యతలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2026
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ రంగంపై ప్రపంచ సాంకేతిక సంస్థలు మరింత దృష్టి సారిస్తున్న వేళ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌ బుక్‌కు చెందిన మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఆ ప్రణాళికలకు సంబంధించిన వివరాలను తాజాగా ఉద్యోగులకు వెల్లడించింది. కంపెనీలో 10శాతం మందిపై వేటు వేసింది. ఈ తొలగింపుల ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభం కానుందని పేర్కొంది. అదే సమయంలో సుమారు 7 వేల మంది ఉద్యోగులను కృత్రిమ మేధకు సంబంధించిన విధుల్లోకి మార్చనున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

నిర్వహణ స్థాయి బాధ్యతల్లో ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం

ఈ విషయాన్ని సంస్థ మానవ వనరుల విభాగాధిపతి జానెల్లె గేల్‌ ఉద్యోగులకు పంపిన అంతర్గత సమాచార పత్రంలో వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత పనితీరుకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నాయని, మెటా కూడా అదే దిశగా ముందుకెళ్తోందని తెలిపారు. ఈ మార్పుల్లో భాగంగానే 10 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ముఖ్యంగా నిర్వహణ స్థాయి బాధ్యతల్లో ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం ఉండనున్నట్లు సమాచారం.

వివరాలు 

8 వేల మందిపై ఈ ఉద్యోగాల కోత ప్రభావం

అలాగే దాదాపు 7 వేల మంది ఉద్యోగులను కృత్రిమ మేధ ఆధారిత కొత్త ప్రాజెక్టుల్లోకి బదిలీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొంతమంది ఉద్యోగుల మార్పులు పూర్తయ్యాయని, మిగిలిన వారికి మే 20 నుంచి వివరాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఇదే పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరో 6 వేల కొత్త ఉద్యోగ బాధ్యతలను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా మెటాలో సుమారు 78 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 10 శాతం అంటే దాదాపు 8 వేల మందిపై ఈ ఉద్యోగాల కోత ప్రభావం పడనుంది.

Advertisement

వివరాలు 

2028 నాటికి డేటా సెంటర్ల ఏర్పాటుకు 600 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాలని సంస్థ ప్రణాళిక

తాజా నిర్ణయాల ప్రకారం ఉద్యోగాల తొలగింపులు, బదిలీలు కలిపి సంస్థలో దాదాపు 20 శాతం మంది సిబ్బందిపై ప్రభావం చూపనున్నాయి. ఈ ఏడాది చివర్లో మరికొంతమందిని కూడా తొలగించే అవకాశాలు ఉన్నట్లు అంతర్గత సమాచారం వెలుగులోకి వచ్చింది. 2022-23 తర్వాత మెటా చేపడుతున్న అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే కావడం గమనార్హం. 2022 చివర్లో సంస్థ 11 వేల మందిని విధుల నుంచి తొలగించగా, ఆ తర్వాతి ఏడాది మరో 10 వేల మందిపై వేటు వేసింది. ప్రస్తుతం కృత్రిమ మేధ రంగంలో మెటా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగా 2028 నాటికి డేటా సెంటర్ల ఏర్పాటుకు 600 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాలని సంస్థ ప్రణాళికలు రూపొందించినట్లు ఇటీవల ప్రకటించింది.

Advertisement

వివరాలు 

ఆ బ్యాంక్‌లో 15శాతం లేఆఫ్‌లు..

ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇక మరోవైపు బ్రిటన్‌కు చెందిన బహుళజాతి బ్యాంకింగ్‌ సంస్థ స్టాండర్డ్‌ ఛార్టెర్డ్‌ కూడా ఉద్యోగాల కోత దిశగా అడుగులు వేస్తోంది. 2030 నాటికి సంస్థలో 15 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. వారి స్థానంలో కృత్రిమ మేధ ఆధారిత యంత్ర విధానాలను వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 8 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు సమాచారం.

Advertisement