LOADING...
8th Central Pay Commission: 8వ పే కమిషన్‌లో కీలక ముందడుగు.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన ప్రారంభం
8వ పే కమిషన్‌లో కీలక ముందడుగు.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన ప్రారంభం

8th Central Pay Commission: 8వ పే కమిషన్‌లో కీలక ముందడుగు.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం(8th Central Pay Commission)కీలక దశలోకి ప్రవేశించింది. ఉద్యోగ,పెన్షనర్ల సంఘాల నుంచి వినతులు, ప్రతిపాదనల స్వీకరణ ప్రక్రియ జూన్ 15తో ముగియగా, ప్రస్తుతం వాటిని కమిషన్ సమగ్రంగా పరిశీలిస్తోంది. తుది సిఫార్సులు రూపొందించే ముందు ప్రతి డిమాండ్‌పై కూలంకషంగా అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. కోటి మందిపై ప్రభావం 2025 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8వపే కమిషన్‌కు తన నివేదిక సమర్పించేందుకు దాదాపు 10 నెలల గడువు ఇచ్చింది. కమిషన్ సిఫార్సుల ఆధారంగా దేశవ్యాప్తంగా సుమారు 55లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,69 లక్షల మంది పెన్షనర్ల వేతనాలు,పెన్షన్లు, వివిధ అలవెన్సుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

వివరాలు 

ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు

దీంతో కోటి మందికి పైగా ప్రజలు కమిషన్ నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు సమర్పించిన మెమొరాండంలలో పలు కీలక అంశాలను ప్రస్తావించాయి. ముఖ్యంగా వేతనాల పెంపులో కీలకమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గణనీయంగా పెంచాలని కోరుతున్నాయి. కొన్ని సంఘాలు 3.15 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కనీస మూల వేతనాన్ని భారీగా పెంచాలని విజ్ఞప్తి చేశాయి.ఇదే సమయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్‌) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్‌) తిరిగి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కోరుతున్నాయి. దీనితో పాటు ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ),రిస్క్ అలవెన్స్‌,బోనస్‌లు, సెలవు ప్రయోజనాలు, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను మెరుగుపరచాలని కూడా ప్రతిపాదించాయి

వివరాలు 

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పైనే అందరి దృష్టి

వేతన సవరణలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ద్రవ్యోల్బణం,జీవన వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత మూల వేతనాన్ని కొత్త వేతన స్కేల్‌కు మార్చేందుకు ఉపయోగించే గుణకాన్నే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌గా పేర్కొంటారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం 2.5 కంటే అధిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం 3.15 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలుపై ఆశలు పెట్టుకున్నాయి. ఈ విషయంలో కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేస్తుందన్నది ఉద్యోగులు, పెన్షనర్లలో ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

వివరాలు 

పలు రాష్ట్రాల్లో సంప్రదింపులు పూర్తి

8వ పే కమిషన్ ఇప్పటికే ఢిల్లీ, లడఖ్‌, జమ్మూ కశ్మీర్‌, హైదరాబాద్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు పూర్తి చేసింది. రానున్న రోజుల్లో జూలై వరకు లక్నో, భువనేశ్వర్‌, కోల్‌కతా నగరాల్లో పర్యటించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి కరవు భత్యం (డీఏ), కరవు ఉపశమనం (డీఆర్‌)ను 2 శాతం పెంచి మొత్తం రేటును 60 శాతానికి చేర్చింది. ఇక తదుపరి డీఏ పెంపు ఈ ఏడాది మే, జూన్ నెలలకు సంబంధించిన ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ సూచీ గణాంకాల ఆధారంగా నిర్ణయించబడనుంది.

Advertisement