8th Pay Commission: 3.0x నుంచి 4.0x వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.. ఎవరికెంత లాభం..?
ఈ వార్తాకథనం ఏంటి
8వ వేతన సంఘం (8th Pay Commission)పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లలో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం,జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ సంఘాలు జీతాలు, పెన్షన్లలో భారీ పెంపు కోరుతున్నాయి. చాలా సంఘాలు 3.0 నుంచి 4.0 వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లు ఆమోదం పొందితే ప్రస్తుతం ఉన్న కనీస బేసిక్ జీతం రూ.18వేల నుంచి దాదాపు రూ.69వేల నుంచి రూ.72వేల వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం,ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తీసుకునే నిర్ణయం వచ్చే పదేళ్ల జీతాలు, పెన్షన్ వ్యవస్థపై ప్రభావం చూపనుంది.
వివరాలు
8వ వేతన సంఘం అంటే ఏమిటి..?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, అలవెన్సులు, పెన్షన్ల సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే తాత్కాలిక కమిషన్‌ను వేతన సంఘం అంటారు. ప్రస్తుతం 8వ వేతన సంఘానికి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. మరో ఇద్దరు సభ్యులుగా పులక్ ఘోష్, పంకజ్ జైన్ ఉన్నారు. ఈ కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, ప్రమోషన్ విధానాలపై సమీక్ష చేసి సిఫార్సులు చేసే అవకాశం ఉంది.
వివరాలు
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి..?
ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ జీతంపై ఎంత పెంపు ఇవ్వాలనేది నిర్ణయించే లెక్కనే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. దీని ఆధారంగానే కొత్త జీతాలు లెక్కిస్తారు. 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, 6వ వేతన సంఘంలో 1.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేశారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఇవే.. ఉద్యోగ సంఘాల్లో BPMS అత్యధికంగా 4x ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోరుతోంది. మరోవైపు NCJCM స్టాఫ్ సైడ్ 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో పాటు కనీస జీతాన్ని రూ.69 వేలకు పెంచాలని కేంద్రానికి నివేదిక సమర్పించింది. AIDEF కూడా ఇదే డిమాండ్‌కు మద్దతు ఇస్తోంది.మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ ఆర్గనైజేషన్ 3.8 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోరుతూ,పెన్షన్ హామీలు,DA విలీనం,HRA,TA పెంపులు కూడా డిమాండ్ చేసింది.
వివరాలు
జీతాల లెక్కింపు ఎలా జరుగుతుంది..?
FNPO, AITUC వంటి సంస్థలు మాత్రం 3.0 లేదా అంతకంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సరిపోతుందని చెబుతున్నాయి. కొత్త బేసిక్ జీతం లెక్కింపు చాలా సులభం. కొత్త బేసిక్ జీతం = ప్రస్తుత బేసిక్ జీతం × ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉదాహరణకు ప్రస్తుతం రూ.18 వేల బేసిక్ జీతంపై 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే జీతం దాదాపు రూ.69 వేల వరకు పెరుగుతుంది. దీనికి అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు కూడా జత అవుతాయి. ఈ లెక్కల ప్రకారం BPMS సూచించిన 4x ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమల్లోకి వస్తే ఉద్యోగులకు అత్యధిక వేతన పెంపు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
ప్రభుత్వం ముందు సవాళ్లు
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నా..మరోవైపు ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా గణనీయంగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కుటుంబ ఖర్చులు,పెన్షన్ సరిపోకపోవడం వంటి కారణాలతో ఉద్యోగ సంఘాలు భారీ పెంపు కోరుతున్నాయి. చివరకు ఎంత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఖరారు అవుతుంది..? ప్రస్తుతం 8వ వేతన సంఘం ఎలాంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అధికారికంగా ఖరారు చేయలేదు. ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతున్నాయి. జూన్ 22,23 తేదీల్లో లక్నోలో కీలక సమావేశాలు జరగనున్నాయి. NCJCM,AIDEF వంటి సంఘాలు 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై పట్టుబడుతుండగా.. BPMS 4xఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోసం ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే అన్ని అంశాలు,ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.