BitCoin : క్రిప్టో ప్రపంచంలో కొత్త రికార్డు.. 94వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్!
క్రిప్టోకరెన్సీ రంగంలో మరో చరిత్ర సృష్టిస్తూ బిట్ కాయిన్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రేడింగ్ సెషన్‌లో తొలిసారిగా 94,038.97 డాలర్ల స్థాయిని తాకిన బిట్‌కాయిన్ ప్రస్తుతం 92 వేల డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత క్రిప్టో మార్కెట్‌లో మరింత దూకుడు కన్పిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో పాటు ఎలాన్ మస్క్ వంటి ప్రముఖుల సానుకూల వ్యాఖ్యలతో బిట్‌కాయిన్ ధరలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఏడాది కాలంలోనే 146శాతం రాబడి
గత నెలలో బిట్‌కాయిన్ ధరలు 33 శాతం పెరగ్గా, మూడు నెలల్లో 56 శాతం, ఏడాది కాలంలో 146 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. ప్రస్తుతం బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 1.82 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ధర త్వరలో లక్ష డాలర్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్‌తో పాటు, ఎలాన్ మస్క్‌కు ఇష్టమైన డోజ్‌కాయిన్ కూడా ధర కూడా పెరుగుతోంది. డోజ్‌కాయిన్ మూడునెలల్లో 271 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించగా, ఏడాది కాలంలో 400 శాతం రాబడిని నమోదు చేస్తూ రికార్డు సృష్టించింది.
క్రిప్టోకరెన్సీ మార్కెట్ మరింత అభివృద్ధి చెందే అవకాశం
ప్రస్తుతం డోజ్‌కాయిన్ ధర 0.382 డాలర్లుగా ఉంది. ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ 3 ట్రిలియన్ డాలర్లను దాటింది. నవంబర్ 5న 2.26 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ క్యాప్ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 3.07 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ మార్కెట్ విలువ, కొన్ని దేశాల జీడీపీ కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం. బిట్‌కాయిన్ ధరల పెరుగుదలతో పాటు, క్రిప్టోకరెన్సీ మార్కెట్ మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.