LOADING...
Advit Jewels Ipo : 212 రెట్లు సబ్‌స్క్రిప్షన్.. అద్విత్ జువెల్స్ IPOకు భారీ క్రేజ్ వెనుక కారణాలివే..
అద్విత్ జువెల్స్ IPOకు భారీ క్రేజ్ వెనుక కారణాలివే..

Advit Jewels Ipo : 212 రెట్లు సబ్‌స్క్రిప్షన్.. అద్విత్ జువెల్స్ IPOకు భారీ క్రేజ్ వెనుక కారణాలివే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి దృష్టి ప్రస్తుతం ఐపీఓలపై ఎక్కువగా ఉంది. మార్కెట్ మళ్లీ ఊపందుకోవడంతో వరుసగా ఐపీఓలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఐపీఓ మార్కెట్‌లో 2026లో అత్యంత చర్చనీయాంశంగా మారింది అద్విత్ జువెల్స్ ఐపీఓ. కేవలం మూడు రోజుల్లోనే ఈ పబ్లిక్ ఇష్యూ 212 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) విభాగంలో 536 రెట్లు,క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో 175 రెట్లు,రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 95 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. ఈ గణాంకాలే పెట్టుబడిదారుల నుంచి వచ్చిన భారీ స్పందనను స్పష్టంగా చూపిస్తున్నాయి.

వివరాలు 

భారీ ఐపీఓలకు ఎంతటి డిమాండ్ ఉండొచ్చన్న చర్చ

మరోవైపు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) కూడా సుమారు 40 శాతం వద్ద కొనసాగడంతో లిస్టింగ్ రోజున మంచి లాభాలు వచ్చే అవకాశాలపై అంచనాలు పెరిగాయి. ఇంత చిన్న ఐపీఓకే ఈ స్థాయిలో స్పందన లభిస్తే, త్వరలో రానున్న ఎన్ఎస్ఈ, రిలయన్స్ జియో, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ వంటి భారీ ఐపీఓలకు ఎంతటి డిమాండ్ ఉండొచ్చన్న చర్చ కూడా మార్కెట్‌లో మొదలైంది. అసలు అద్విత్ జువెల్స్ కంపెనీ ఏమిటి? ఈ ఐపీఓకు ఎందుకింత క్రేజ్ వచ్చింది? అనే వివరాలు తెలుసుకుందాం.

వివరాలు 

అద్విత్ జువెల్స్ కంపెనీ ప్రత్యేకత ఏమిటి?

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అద్విత్ జువెల్స్ సంప్రదాయ హస్తకళా ఆభరణాల తయారీలో మంచి గుర్తింపు పొందింది. 'రంభాజో' బ్రాండ్ పేరుతో కుందన్, డైమండ్, పోల్కీ, స్టడెడ్ జువెల్లరీని తయారు చేసి విక్రయిస్తోంది. ఈ బ్రాండ్‌కు వందేళ్లకు పైగా చరిత్ర ఉండటం కంపెనీపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను మూలధన వ్యయం, అప్పుల తగ్గింపు, వ్యాపార విస్తరణ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement

వివరాలు 

పబ్లిక్ ఇష్యూ వివరాలు

ఈ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూగా మార్కెట్లోకి వచ్చింది. అంటే ప్రమోటర్లు తమ షేర్లను విక్రయించకుండా కొత్త షేర్లను మాత్రమే జారీ చేశారు. ఇష్యూ ధర: రూ.130 నుంచి రూ.138 ఒక్క లాట్‌లో షేర్లు: 100 కనీస పెట్టుబడి: రూ.13,800 సబ్‌స్క్రిప్షన్ తేదీలు: జూన్ 23 నుంచి జూన్ 25 వరకు షేర్ అలాట్‌మెంట్: జూన్ 29 ఎక్స్చేంజీల్లో లిస్టింగ్: జులై 1న జరిగే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

భారీ సబ్‌స్క్రిప్షన్‌కు కారణాలివే..

ఈ ఐపీఓకు భారీ స్పందన రావడానికి అనేక అంశాలు కలిసి వచ్చాయి. మొదటిగా, ఐపీఓ ప్రారంభానికి ముందే గ్రే మార్కెట్ ప్రీమియం 40 నుంచి 50 శాతం మధ్య ఉండటంతో లిస్టింగ్ రోజున మంచి లాభాలు వస్తాయన్న అంచనాలు పెరిగాయి. దీంతో షార్ట్‌టర్మ్ లాభాల కోసం చాలా మంది పెట్టుబడిదారులు దరఖాస్తు చేశారు. రెండో కారణం, ఈ ఐపీఓ ద్వారా కంపెనీ కేవలం రూ.165 కోట్ల నిధులనే సమీకరించింది. ఇష్యూ పరిమాణం చిన్నదిగా ఉండగా పెట్టుబడిదారుల సంఖ్య భారీగా ఉండటంతో సబ్‌స్క్రిప్షన్ గణాంకాలు మరింత పెరిగాయి.

వివరాలు 

జువెల్లరీ రంగంపై పెట్టుబడిదారుల విశ్వాసం

భారతదేశంలో బంగారం, ఆభరణాల మార్కెట్‌కు నిరంతర డిమాండ్ కొనసాగుతోంది. పండుగలు, వివాహాలు, ఎగుమతుల కారణంగా ఈ రంగానికి దీర్ఘకాలిక అవకాశాలు ఉన్నాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. అదే సమయంలో కంపెనీ గత కొన్నేళ్లుగా ఆదాయం, లాభాలను పెంచుకుంటూ రావడం, పలు బ్రోకరేజ్ సంస్థలు సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా పెట్టుబడిదారులను ఆకర్షించిన అంశాలుగా నిలిచాయి.

వివరాలు 

200 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అంటే కంపెనీ అత్యుత్తమమా?

ఒక ఐపీఓ 200 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయిందంటే ఆ కంపెనీ అత్యుత్తమమని భావించడం సరైన విధానం కాదు. చిన్న ఇష్యూ పరిమాణం, తక్కువ ఫ్రీ ఫ్లోట్, భారీ లిస్టింగ్ గెయిన్స్ అంచనాలు వంటి అంశాలు కూడా సబ్‌స్క్రిప్షన్‌ను భారీగా పెంచుతాయి. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత మూడు నెలలుగా స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు కనిపించాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత మార్కెట్ మళ్లీ కోలుకుంటుండటం, ఈ ఐపీఓకు మంచి జీఎంపీ ఉండటం కూడా పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచిన అంశాలుగా మారాయి.

వివరాలు 

జియో, NSE ఐపీఓలకు కూడా ఇదే స్పందన వస్తుందా?

త్వరలో మార్కెట్లోకి వచ్చే రిలయన్స్ జియో, ఎన్ఎస్ఈ వంటి మెగా ఐపీఓలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సంస్థలకు బలమైన బ్రాండ్ విలువ, పెద్ద వినియోగదారుల ఆధారం, మెరుగైన ఆర్థిక స్థితి ఉండటంతో మంచి డిమాండ్ రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇవి భారీ పరిమాణంలో షేర్లను జారీ చేసే మెగా ఐపీఓలు కావడంతో అద్విత్ జువెల్స్ తరహాలో 200 రెట్లకు పైగా సబ్‌స్క్రిప్షన్ నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిధుల సమీకరణ పరంగా ఇవి దేశంలోనే అతిపెద్ద ఐపీఓలుగా నిలిచే అవకాశం ఉంది.

వివరాలు 

ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం

ఒక ఐపీఓకు భారీ సబ్‌స్క్రిప్షన్ రావడం మాత్రమే దీర్ఘకాలికంగా మంచి పెట్టుబడికి హామీ కాదు. గతంలో పేటీఎం, ఎల్ఐసీ వంటి పలు ఐపీఓలు ప్రారంభంలో భారీ హైప్ సృష్టించినప్పటికీ, తర్వాత ఆశించిన స్థాయిలో రాబడులు ఇవ్వలేదు. అందుకే ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ వ్యాపార నాణ్యత, ఆర్థిక పనితీరు, వాల్యుయేషన్, లాభదాయకత, భవిష్యత్ వృద్ధి అవకాశాలను పూర్తిగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అయితే అద్విత్ జువెల్స్ ఐపీఓకు వచ్చిన స్పందన మాత్రం ప్రస్తుతం మార్కెట్‌లో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలంగా ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.

Advertisement