Oracle Layoffs: ఏఐ డేటా ఎఫెక్ట్.. టెక్ రంగంలో 30 వేల ఉద్యోగాలకు ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
కారణాలు ఏవైనా కావొచ్చు.. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుపై దృష్టి పెట్టాయి. ఒకవైపు ఏఐ రావడంతో ఉద్యోగాలు పోతున్నాయనే ప్రచారం నడుస్తుండగా, మరోవైపు ఏఐ ప్రాజెక్టుల కోసం నిధులు సమకూర్చుకునేందుకు పలు సంస్థలు సిబ్బందిని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ కోవలోకి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన ఒరాకిల్ (Oracle) కూడా చేరినట్లు సమాచారం. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికాలో ట్రంప్ పాలసీల ప్రభావం వంటి అంశాలను టెక్ కంపెనీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐ పేరిట చాలామంది ఉద్యోగాలు కోల్పోగా, ఇప్పుడు 'మలి విడత లేఆఫ్స్‌పై' టెక్ కంపెనీలు దృష్టి సారించాయి.
Details
ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
ఈ నేపథ్యంలో ఒరాకిల్ సంస్థ ఏఐ డేటా సెంటర్లకు నిధులు సమకూర్చేందుకు సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వెలువడగానే సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, ఒరాకిల్ నుంచి లేఆఫ్స్ సంకేతాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చులను కుదించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Details
ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ కత్తెర
లేఆఫ్స్ ద్వారా ఆదా అయ్యే నిధులను డేటా సెంటర్ల నిర్మాణానికి వినియోగించాలన్నది ఒరాకిల్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయాలను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ రూపొందించిన పరిశోధనా నివేదికను ఉటంకిస్తూ సీఐఓ (CIO) అనే సంస్థ వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం ఒరాకిల్ తన ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు సుమారు 156 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే అంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు వెనుకాడుతున్నట్లు సమాచారం. కొన్ని వారాలుగా అమెరికాలోని పలు బ్యాంకులు ఒరాకిల్‌కు రుణాలు మంజూరు చేయడంలో వెనక్కి తగ్గాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Details
20-30 వేల ఉద్యోగాలకు ముప్పు?
సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐ కోసం డేటా సెంటర్ల నిర్మాణ బాధ్యతను ఒరాకిల్ తీసుకున్నప్పటికీ, నిధుల కొరత కారణంగా ఆ ప్రాజెక్టులపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. భారీ లేఆఫ్స్ ద్వారా ఒరాకిల్‌కు 8 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఫ్రీ క్యాష్ ఫ్లో లభించే అవకాశముందని అంచనా. ఈ నేపథ్యంలోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కన 20 నుంచి 30 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం. ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఒరాకిల్ కంపెనీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే ఈ వార్తలు నిజమైతే, ఇది ఒరాకిల్ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్‌గా నిలవనుంది.
Details
గతంలో 10వేల ఉద్యోగాల తొలగింపు
ఇదిలా ఉండగా రిస్ట్రక్చరింగ్ ప్లాన్‌లో భాగంగా గత ఏడాది చివర్లోనే 10 వేల మంది ఉద్యోగులను ఒరాకిల్ తొలగించింది. భారత్‌లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతా వంటి నగరాల్లో ఒరాకిల్ కార్యాలయాలు ఉండగా, వేలాది మంది అక్కడ పని చేస్తున్నారు. సంవత్సరం ఆరంభంలోనే లేఆఫ్స్ వార్తలు రావడంతో టెక్కీల్లో ఆందోళన మొదలైంది. రానున్న రోజుల్లో ఇంకెన్ని టెక్ సంస్థలు ఉద్యోగుల తగ్గింపునకు ప్రకటనా చేస్తాయోనన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.