LOADING...
Perplexity Offer to Google: గూగుల్ క్రోమ్‌ను కొనుగోలుకుAI స్టార్టప్ పెర్ప్లెక్సిటీ $34.5 బిలియన్ల భారీ ఆఫర్‌..! 
గూగుల్ క్రోమ్‌ను కొనుగోలుకుAI స్టార్టప్ పెర్ప్లెక్సిటీ $34.5 బిలియన్ల భారీ ఆఫర్‌..!

Perplexity Offer to Google: గూగుల్ క్రోమ్‌ను కొనుగోలుకుAI స్టార్టప్ పెర్ప్లెక్సిటీ $34.5 బిలియన్ల భారీ ఆఫర్‌..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధా స్టార్టప్‌ సంస్థ పర్‌ప్లెక్సిటీ ప్రపంచంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఓపెన్‌ సోర్స్‌ వెబ్‌ బ్రౌజర్‌ గూగుల్‌ క్రోమ్ కొనుగోలుపై ఆసక్తి చూపుతోంది. కంపెనీ సీఈఓ అరవింద్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో, గూగుల్‌కు సుమారు 34.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3.02 లక్షల కోట్లు) ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఈ మొత్తమే పర్‌ప్లెక్సిటీ మొత్తం మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ కావడం విశేషం. ప్రస్తుతం బ్రౌజర్‌ రంగంలో గూగుల్‌ క్రోమ్‌ ఆధిపత్యం కొనసాగుతుండగా, దాన్ని విక్రయించాలంటూ అమెరికా ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ ప్రతిపాదన రావడం గమనార్హం.

వివరాలు 

గూగుల్‌ క్రోమ్‌ కోసం చేసిన ఆఫర్‌ కంపెనీ విలువకు దాదాపు రెండింతలు

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఈ కొనుగోలు ఒప్పందం పూర్తిచేయడానికి పర్‌ప్లెక్సిటీ బాహ్య పెట్టుబడిదారుల సహాయాన్ని పొందనుంది. అనేక పెట్టుబడిదారులు మొత్తం లావాదేవీకి పూర్తి ఫైనాన్స్‌ అందించేందుకు అంగీకరించారని కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ దిమిత్రి షెవెలెంకో తెలిపారు. ఇటీవల జూలైలో పర్‌ప్లెక్సిటీ 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.875 కోట్లు) నిధులు సమీకరించింది. ఆ సమయంలో కంపెనీ మొత్తం విలువను దాదాపు రూ.1.57 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ లెక్కన గూగుల్‌ క్రోమ్‌ కోసం చేసిన ఆఫర్‌ కంపెనీ విలువకు దాదాపు రెండింతలుగా ఉందని చెప్పొచ్చు.

వివరాలు 

ఎప్పటికీ ఓపెన్‌ సోర్స్‌గా కొనసాగిస్తామని భరోసా

ఈ ఆఫర్‌ను పర్‌ప్లెక్సిటీ 'టెక్‌ క్రంచ్‌'తో ధృవీకరించింది. క్రోమ్‌ ప్రాధాన్య ఇంజిన్‌ క్రోమియంను ఎప్పటికీ ఓపెన్‌ సోర్స్‌గా కొనసాగిస్తామని, ఏటా దాదాపు 3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.26 వేల కోట్లు) పెట్టుబడి పెట్టే భరోసా ఇచ్చింది. అలాగే ఈ ఒప్పందం విజయవంతమయినా, పర్‌ప్లెక్సిటీని వినియోగదారుల డిఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా మార్చే ఆలోచన లేదని, ప్రస్తుత గూగుల్‌ క్రోమ్‌ రూపంలోనే కొనసాగిస్తామని స్పష్టంచేసింది.

వివరాలు 

యాంటీ-ట్రస్ట్‌ ఒత్తిడిలో గూగుల్‌ 

గూగుల్‌ క్రోమ్‌ను విక్రయించే ప్రణాళికపై ఇప్పటికీ స్పష్టత లేకపోయినా, బ్రౌజర్‌ విభాగంలో గూగుల్‌ ఆధిపత్యం కొనసాగించడానికి అనైతిక పద్ధతులు అనుసరించిందన్న ఆరోపణలను కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్టు సమర్థించింది. శాంసంగ్‌, ఆపిల్‌ వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, వారి పరికరాల్లో గూగుల్‌ సెర్చ్‌ను డిఫాల్ట్‌గా ఉంచేందుకు చెల్లింపులు చేసినట్లు ఆరోపిస్తూ, అమెరికా న్యాయశాఖతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులో వ్యాజ్యాలు వేశాయి. గూగుల్‌ విధానాలు పోటీ చట్టాలకు విరుద్ధమని తమ కేసుల్లో పేర్కొన్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వం.. గూగుల్‌ క్రోమ్‌ను విక్రయించాలి, సెర్చ్‌ డేటాను పోటీదారులకు లైసెన్స్‌ ఇవ్వాలి, ఇతర ప్లాట్‌ఫాంల్లో ప్రత్యేక ప్రమోషన్‌ల కోసం చెల్లింపులను నిలిపివేయాలంటూ సూచనలు జారీ చేసింది.

వివరాలు 

పర్‌ప్లెక్సిటీ కృత్రిమ మేధపై ఆధారపడిన సెర్చ్‌ ఇంజిన్‌

ఇక పర్‌ప్లెక్సిటీ విషయానికి వస్తే.. ఇది కృత్రిమ మేధపై ఆధారపడిన సెర్చ్‌ ఇంజిన్‌, చాట్‌జీపీటీ తరహా యాప్‌. కామెట్‌ పేరుతో స్వంత బ్రౌజర్‌ సేవలు అందిస్తోంది. 2026 నాటికి ఈ బ్రౌజర్‌ వినియోగదారుల సంఖ్యను 10 కోట్ల నుంచి వందల కోట్లకు పెంచడమే తమ లక్ష్యమని, ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.