Air India: ఎయిర్ ఇండియా పైలట్లకు భారీగా జీతాల పెంపు.. 15 శాతం వరకు హైక్
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా తమ పైలట్లకు భారీగా జీతాలు పెంచింది. పైలట్ల హోదాను బట్టి 8 శాతం నుంచి 15 శాతం వరకు వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందులో అత్యధికంగా కమాండర్లకు జీతాల పెంపు లభించనుంది. పైలట్ల ర్యాంకును బట్టి ఈ పెంపు క్రమంగా తగ్గుతుంది. మెరుగైన వేతనాలతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను పైలట్లకు మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు, బీ737 విమానాల విభాగంలో ఉన్న పైలట్ల కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
పైలట్లకు కొత్త కెరీర్ ప్రోగ్రెషన్ ప్లాన్..
జీతాల పెంపుతో పాటు పైలట్ల కోసం కొత్త కెరీర్ ప్రోగ్రెషన్ ప్లాన్‌ను కూడా ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టింది.
ఈ కొత్త విధానం ప్రకారం.. ఫస్ట్ ఆఫీసర్లు లేదా కో-పైలట్లకు ముందుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కమాండర్‌గా పదోన్నతి లభిస్తుంది.
ఆ తర్వాత వారు ఎయిర్ ఇండియాకు మారే అవకాశం ఉంటుంది.
ఎయిర్ ఇండియాలో వైడ్ బాడీ విమానాలు ఉండటంతో పాటు అధిక వేతనాలు లభిస్తాయి.
దీంతో ఎయిర్ ఇండియా గ్రూప్‌లో పైలట్లకు స్పష్టమైన కెరీర్ పురోగతి మార్గం ఏర్పడనుంది.
వివరాలు
కొత్త విధానంలో పే స్ట్రక్చర్‌లో మార్పులు..
కొత్త విధానంలో భాగంగా ఎయిర్ ఇండియా తన పే స్ట్రక్చర్‌ను కూడా సవరించింది.
పైలట్లకు నెలకు 40 గంటల ఫ్లయింగ్‌కు గ్యారెంటీడ్ పే విధానం కొనసాగనుంది.
అయితే ఫ్లయింగ్ అలవెన్స్ రేట్లను పెంచింది. పరిశ్రమలో అమలవుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
పైలట్ల పనితీరు, ఉత్పాదకతకు అనుగుణంగా అదనపు ప్రయోజనం కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందించింది.
ఇదిలా ఉంటే.. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత నిలిపివేసిన కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా తిరిగి పునరుద్ధరిస్తోంది.
వచ్చే నెల నాటికి జనవరి-ఫిబ్రవరి స్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది.
వివరాలు
సీనియర్ కమాండర్ జీతం రూ.8.3 లక్షలకు పెంపు..
కొత్త జీతాల విధానం ప్రకారం నెలకు 55 గంటలు విమానాలు నడిపే సీనియర్ కమాండర్‌కు రూ.8.3 లక్షల వరకు వేతనం లభించనుంది.
గతంలో ఈ మొత్తం రూ.7.5 లక్షలుగా ఉండేది. అంటే సీనియర్ కమాండర్ వేతనం గణనీయంగా పెరిగింది.
అదే సమయంలో ఫస్ట్ ఆఫీసర్ వేతనం కూడా పెరిగింది. గతంలో రూ.3 లక్షలకు కొద్దిగా ఎక్కువగా ఉన్న జీతం ఇప్పుడు రూ.3.3 లక్షలకు చేరింది.
అయితే కొత్త విధానంలో ప్రివిలేజ్ లీవ్‌లను 30 రోజుల నుంచి 24 రోజులకు తగ్గించారు.
అయితే పైలట్లకు లభించే వారపు సెలవులను లీవ్‌లలో లెక్కించబోమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.