Air India Dreamliner: ఎనిమిదేళ్ల తర్వాత ఎయిరిండియా చేతికి డ్రీమ్‌లైనర్.. 8 ప్రైవేటీకరణ తర్వాత తొలి వైడ్‌బాడీ విమానం
ఈ వార్తాకథనం ఏంటి
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా కోసం ఆర్డర్ చేసిన కొత్త విమానాలు ఒక్కోటి చొప్పున డెలివరీ అవుతున్నాయి. తాజాగా బోయింగ్ తయారు చేసిన 787-9 డ్రీమ్‌లైనర్ విమానం ఎయిరిండియా ఫ్లీట్‌లో చేరింది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరో డ్రీమ్‌లైనర్ సంస్థకు రావడం విశేషంగా నిలిచింది. ప్రైవేటీకరణ అనంతరం ఎయిరిండియా అందుకున్న తొలి డ్రీమ్‌లైనర్ ఇదే కావడం గమనార్హం. జనవరి 7న సియాటెల్‌లో ఉన్న బోయింగ్ ప్లాంట్ నుంచి ఈ విమానాన్ని డెలివరీ చేయగా, ఎయిరిండియా స్వీకరించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తనిఖీల అనంతరం ప్రయాణానికి అందుబాటులోకి రానుంది.
వివరాలు
డ్రీమ్‌లైనర్'లో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ విభాగాలు
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సమయంలో 2017 అక్టోబర్‌లో చివరిసారిగా డ్రీమ్‌లైనర్ విమానం ఎయిరిండియా ఫ్లీట్‌లో చేరింది. ఆ తర్వాత ఇన్నేళ్ల విరామానికి మళ్లీ ఇప్పుడు మరో డ్రీమ్‌లైనర్ సంస్థకు లభించింది. ఎయిరిండియా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విమానాన్ని బోయింగ్ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఇందులో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ విభాగాలు ఉండనున్నాయి.
వివరాలు
టాటా గ్రూప్ మొత్తం 570 విమానాలకు ఆర్డర్
ఎయిరిండియాను కొనుగోలు చేసిన తర్వాత 2023లో టాటా గ్రూప్ మొత్తం 570 విమానాలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 350 ఎయిర్‌బస్ విమానాలు, 220 బోయింగ్ విమానాలు ఉన్నాయి. ఇప్పటికే 51 నారో బాడీ విమానాలు డెలివరీ కాగా, ఇప్పుడు తొలి వైడ్ బాడీ విమానం సంస్థ చేతికి వచ్చింది. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్ వద్ద మొత్తం 300 విమానాలు ఉండగా, వాటిలో 185ను ఎయిరిండియా నిర్వహిస్తోంది. మిగతా విమానాలను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆపరేట్ చేస్తోంది. ఈ ఏడాదిలోనే మరికొన్ని డ్రీమ్‌లైనర్ విమానాలు కూడా అందుబాటులోకి రానున్నాయని ఎయిరిండియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.