Gebremariam: ఎయిర్ ఇండియా'ను మళ్లీ అగ్రస్థానంలో నిలుపుతాం: కొత్త సీఈఓ టెవోల్డే గెబ్రెమరియం
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా'ను మళ్లీ గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని ఆ సంస్థకు కొత్త ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న టెవోల్డే గెబ్రెమరియం అన్నారు. ఎయిర్ ఇండియా పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఉద్యోగులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రయాణికుల నమ్మకాన్ని పునరుద్ధరించడంతో పాటు సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని టాటా సన్స్ ఛైర్మన్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా కీలకమైన కొత్త దశలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సంస్థ ఉద్యోగులతో నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రస్తుత ఎండీ, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న టెవోల్డే గెబ్రెమరియంను చంద్రశేఖరన్ ఉద్యోగులకు పరిచయం చేశారు.
వివరాలు
'మళ్లీ అగ్రస్థానానికి తీసుకెళ్తాం'
ఎయిరిండియాకు గొప్ప చరిత్రతో పాటు బలమైన బ్రాండ్, విస్తృతమైన సామర్థ్యం ఉన్నాయని టెవోల్డే గెబ్రెమరియం తెలిపారు.
సంస్థను తిరిగి పాత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉద్యోగులను కోరారు.
''మేం ఎయిరిండియాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం'' అని ఆయన స్పష్టం చేశారు.
గతేడాది చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా పలు సవాళ్లను ఎదుర్కొంటోంది.
పెరుగుతున్న నష్టాలు, విమాన కార్యకలాపాల్లో అంతరాయాలు, నియంత్రణ సంస్థల పర్యవేక్షణ పెరగడం వంటి అంశాలు సంస్థపై ఒత్తిడిని పెంచాయి.
ఇలాంటి కీలక సమయంలో ఎయిరిండియాలో నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది.
వివరాలు
'ఇది నాకు మంచి అవకాశం'
విమానయాన రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టెవోల్డే గెబ్రెమరియం..ఇందులో 11ఏళ్లకు పైగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు.
ఎయిరిండియాతో తనకు గతంలో ఉన్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
దాదాపు రెండుదశాబ్దాల క్రితం ముంబయిలో పనిచేస్తున్న సమయంలో ఎయిరిండియాను దగ్గరగా చూశానని తెలిపారు.
ఆ సమయంలో విమానయాన రంగంలో ఎయిరిండియా అగ్రగామి సంస్థగా ఉండేదని చెప్పారు.
ఇప్పుడు అదే సంస్థను తిరిగి ఆ స్థాయికి తీసుకెళ్లేందుకు పనిచేసే అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
విమానయాన సంస్థకు భద్రతే అత్యంత ముఖ్యమైన అంశంగా ఉండాలని టెవోల్డే స్పష్టం చేశారు.
అదే సమయంలో ఉద్యోగులు తమ సమస్యలు,ఆందోళనలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా తగిన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.