Loading...
Air Ticket Prices: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఏడాదిలో 35.52 శాతం పెరుగుదల
విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఏడాదిలో 35.52 శాతం పెరుగుదల

Air Ticket Prices: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఏడాదిలో 35.52 శాతం పెరుగుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో విమాన ప్రయాణం సామాన్యులకు మరింత భారంగా మారుతోంది. విమాన టికెట్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2026 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో విమాన ప్రయాణ సేవల ధరలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 35.52 శాతం పెరిగాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక సర్వీస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (SPPI) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న ఏడు కీలక సేవా రంగాల్లో విమానయాన రంగంలోనే అత్యధిక ధరల పెరుగుదల నమోదైంది.

వివరాలు 

త్రైమాసికం నుంచి త్రైమాసికానికి పెరుగుతున్న ధరలు

2022-23 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ గణాంకాలను రూపొందించారు.

ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో విమానయాన సేవల ధరల ద్రవ్యోల్బణం 31.94 శాతంగా నమోదైంది.

జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి వచ్చేసరికి ఇది 35.52 శాతానికి చేరింది.

ఇదే సమయంలో ఎయిర్ ప్యాసింజర్ సర్వీస్ ప్రైస్ ఇండెక్స్ 126.4 నుంచి 127.8కి పెరిగింది. అంటే మూడు నెలల వ్యవధిలోనే సూచీ 1.1 శాతం వృద్ధి చెందింది.

బ్యాంకింగ్, సెక్యూరిటీ సేవల్లో తగ్గిన ధరలు

ఓవైపు విమాన టికెట్ల ధరలు పెరుగుతుండగా, కొన్ని ఆర్థిక సేవల ధరలు మాత్రం తగ్గాయి.

సెక్యూరిటీల లావాదేవీల సేవల ధరలు 6.93 శాతం క్షీణించాయి. బ్యాంకింగ్ సేవల ధరల సూచీ కూడా 3.96 శాతం తగ్గింది.

వివరాలు 

రైల్వే, టెలికాం సేవల్లో స్వల్ప పెరుగుదల

అయితే, బ్యాంకింగ్ సేవల కంట్రిబ్యూషన్ ఇండెక్స్ మాత్రం 3.86 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

ఇతర సేవా రంగాలతో పోలిస్తే రైల్వే, టెలికాం, బీమా రంగాల్లో ధరల మార్పులు స్వల్పంగానే ఉన్నాయి.

రైల్వే సేవల ధరలు మొత్తంగా 1.38 శాతం పెరిగాయి. ఇందులో ప్రయాణికుల ఛార్జీలు 2.17 శాతం, సరుకు రవాణా ఛార్జీలు 0.99 శాతం చొప్పున వృద్ధి చెందాయి.

పెన్షన్ ఫండ్ నిర్వహణ సేవల ధరలు 1.01 శాతం పెరిగాయి. టెలికాం సేవల్లో 0.54 శాతం, బీమా సేవల్లో 0.49 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది.

ADVERTISEMENT

వివరాలు 

విమాన టికెట్ల ధరలు ఎందుకు పెరిగాయి?

విమాన ప్రయాణ ఛార్జీలు ఇంత భారీగా పెరగడానికి గల కచ్చితమైన కారణాలను కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించలేదు.

అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో విమాన ఇంధనం (ATF) ధరలు పెరగడం కూడా టికెట్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమై ఉండొచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇక 2026 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన తదుపరి సర్వీస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ నివేదికను 2027 ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నివేదికతో రానున్న రోజుల్లో విమానయానంతో పాటు ఇతర సేవా రంగాల్లో ధరల పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT