Airbus A320: ఏ320 విమానాల్లో సాంకేతిక సమస్య పరిష్కారం: ఎయిర్‌బస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
సోలార్ రేడియేషన్ ప్రభావంతో ఏ320 (Airbus A320) విమానాల్లో కనిపించిన సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి ఎయిర్‌బస్ దాదాపు పూర్తి స్థాయిలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అమలు చేసింది. సోమవారం కంపెనీ ప్రకటన ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,000 విమానాల్లో ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తయిందని తెలిపింది. ఇంకా 100 విమానాల్లో మాత్రమే ఇది మిగిలిందని పేర్కొంది. దీని ద్వారా ఏ320 రకం అన్ని విమానాలు మళ్లీ సాధారణంగా ఆపరేషన్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులు మరియు విమానయాన సంస్థలకు ఎయిర్‌బస్ క్షమాపణలు తెలిపింది. భారత దేశంలో ఏ320 రకం విమానాలు 338 ఉన్నాయి. ఈ అన్ని విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రక్రియ పూర్తయినట్లు ఆదివారం డీజీసీఏ ప్రకటించింది.
వివరాలు
విమానాలలో సాంకేతిక సమస్యలు.. దీని వల్లే
ఈ విమానాలు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థల వద్ద ఉన్నాయి. సూర్యుని వేడి కారణంగా ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ వ్యవస్థ దెబ్బతినడం తెలిసిందే. దీని వల్ల విమానాలలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. గతంలో జెట్ బ్లూ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో కూడా ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. అందువల్ల, ఎయిర్‌బస్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకోవాలని ఇటీవల కీలక హెచ్చరికలు జారీ చేసింది. అధికారుల వివరాల ప్రకారం, సాఫ్ట్‌వేర్ సమస్యకి ప్రధాన కారణం తీవ్రమైన సోలార్ రేడియేషన్. ఏ320 మోడల్ విమానాల్లో నియంత్రణకు సంబంధించిన కీలక డేటా ప్రభావితమైందని, అందుకే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవసరమైందని ఎయిర్‌బస్ తెలిపింది.