LOADING...
Amazon layoffs continue:  30 వేల ఉద్యోగాల తొలగింపుల తర్వాత అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్
30 వేల ఉద్యోగాల తొలగింపుల తర్వాత అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్

Amazon layoffs continue:  30 వేల ఉద్యోగాల తొలగింపుల తర్వాత అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. గత ఆరు నెలల్లో దాదాపు 30 వేల మందిని తొలగించిన సంస్థ.. తాజాగా సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. కంపెనీ సీఈఓ ఆండీ జాస్సీ ఆధ్వర్యంలో సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ఇన్‌సైడర్ కథనం ప్రకారం.. అమెజాన్ సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ టీమ్‌లో "కొద్ది సంఖ్యలో" ఉద్యోగులు ప్రభావితమయ్యారని కంపెనీ ధృవీకరించింది. ఈ విభాగం థర్డ్ పార్టీ విక్రేతలకు సంబంధించిన సేవలను నిర్వహిస్తుంది. కొత్త విక్రేతల నమోదు, లాజిస్టిక్స్, అకౌంట్ మేనేజ్‌మెంట్ వంటి సేవలను ఈ టీమ్ అందిస్తుంది.

వివరాలు 

కొన్ని ఉద్యోగాలను తొలగించాల్సిన కఠిన నిర్ణయం తీసుకున్నాం: అమెజాన్ ప్రతినిధి

"మా లక్ష్యాలను మరింత సమర్థంగా చేరుకునేందుకు సంస్థలోని విభాగాలను తరచూ సమీక్షిస్తుంటాం. తాజా సమీక్ష తర్వాత కొన్ని ఉద్యోగాలను తొలగించాల్సిన కఠిన నిర్ణయం తీసుకున్నాం" అని అమెజాన్ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి హెల్త్‌కేర్ సదుపాయాలు, సెపరేషన్ పేమెంట్స్‌తో పాటు కొత్త ఉద్యోగాల కోసం సహాయాన్ని కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే అక్టోబర్, జనవరిలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టిన అమెజాన్.. మార్చిలో రోబోటిక్స్ విభాగంలో కూడా కోతలు విధించింది. కరోనా సమయంలో ఈ-కామర్స్ విస్తరణ కారణంగా భారీగా నియామకాలు చేపట్టిన సంస్థ.. ఇప్పుడు ఖర్చులను తగ్గించేందుకు, కార్యకలాపాలను మరింత సమర్థంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది.

వివరాలు 

AI విస్తరణతో కొన్ని విభాగాల్లో ఉద్యోగుల అవసరం తగ్గే అవకాశం

ఇక మరోవైపు అమెజాన్ కృత్రిమ మేధస్సు(AI)రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. రిటైల్,లాజిస్టిక్స్,క్లౌడ్ సేవలు,ప్రకటనల విభాగాల్లో AI టూల్స్ వినియోగాన్ని పెంచుతోంది. సాధారణ పనులను ఆటోమేట్ చేసి ఉత్పాదకత పెంచేందుకు ఉద్యోగులను AI సిస్టమ్స్ వినియోగానికి ప్రోత్సహిస్తోంది. దీంతో భవిష్యత్తులో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చనే ఆందోళనలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. AI విస్తరణతో కొన్ని విభాగాల్లో ఉద్యోగుల అవసరం తగ్గే అవకాశం ఉందని ఆండీ జాసీ ఇప్పటికే పేర్కొన్నారు. ఇటీవల CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాసీ మాట్లాడుతూ.. AI టెక్నాలజీ భవిష్యత్తును మార్చే స్థాయిలో ఉందని,కస్టమర్ అనుభవాలను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తుందని తెలిపారు. AI మౌలిక సదుపాయాలు,డేటా సెంటర్ల విస్తరణ కోసం అమెజాన్ దాదాపు 200బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

Advertisement