Amazon layoffs: అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. డివైసెస్ విభాగంలో 250 మంది తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
గత రెండుమూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. పలు దిగ్గజ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి అమెజాన్ కూడా చేరింది. తన డివైసెస్ విభాగంలో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విభాగంలో కిండిల్ ఈ-రీడర్లు, ఎకో స్మార్ట్ పరికరాలు ఉన్నాయి. మెటా, ఒరాకిల్ కంపెనీలు అనుసరించిన విధంగానే అమెజాన్ కూడా ఉద్యోగులకు తెల్లవారుజామున ఈ-మెయిల్స్, టెక్స్ట్ సందేశాల ద్వారా లేఆఫ్‌ల సమాచారాన్ని అందించింది. కంపెనీ అవసరాల దృష్ట్యా కొన్ని ఉద్యోగాలను తొలగించాల్సి వచ్చిందని అమెజాన్ ధ్రువీకరించింది. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉందని పేర్కొంది.
వివరాలు
ఐదు కొత్త అలెక్సా ఆధారిత ఉత్పత్తులను ప్రకటించిన అమెజాన్
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెజాన్ ఐదు కొత్త అలెక్సా ఆధారిత ఉత్పత్తులను ప్రకటించిన రోజే ఈ ఉద్యోగ కోతలు చోటుచేసుకున్నాయి.
రీడిజైన్ చేసిన ఎకో షో 16 స్మార్ట్ డిస్‌ప్లే, అలెక్సా ఫొటో ఫ్రేమ్, ఎకో టైమ్ బెడ్‌సైడ్ క్లాక్ సహా ఐదు కొత్త ఉత్పత్తులను కంపెనీ పరిచయం చేసింది.
వీటి అభివృద్ధిలోనూ ఉద్యోగాల కోతలు జరిగిన డివైసెస్ విభాగమే కీలకంగా వ్యవహరించింది.
వివరాలు
ఉద్యోగులు ఏఐ సాంకేతికతను నేర్చుకోవాలని సూచన
మరోవైపు, ఉద్యోగుల తొలగింపునకు ఒక రోజు ముందే అమెజాన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో కృత్రిమ మేధ (ఏఐ) ప్రాధాన్యంపై ఒక మెమో విడుదల చేసింది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు ఏఐ సాంకేతికతను అంగీకరించి, దానిని నేర్చుకోవాలని సూచించింది.
లేదంటే పోటీలో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని ఆ మెమోలో పేర్కొంది.
దీంతో ఒకవైపు కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తూనే, మరోవైపు ఉద్యోగులను తొలగించడం, ఏఐ నైపుణ్యాలపై ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.