Ambareesh Murthi: పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం
పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అంబరీష్ మూర్తి మృతి చెందారు. సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్నేహితుడు, సహచరుడు, తన గురువు అంబరీష్ మూర్తి ఇక లేరని, నిన్న రాత్రి ఆయన గుండెపోటుతో లేహ్‌లో చనిపోయారని అశిష్ పేర్కొన్నారు. అంబరీష్ మూర్తికి బైక్ రైడింగ్ అంటే అమితమైన ప్రేమ. ఆయన ఎక్కువగా ముంబై నుంచి లేహ్‌కు బైక్‌పై ప్రయాణిస్తుంటారు. ఈ తరుణంలో లేహ్‌కు వెళ్లిన ఆయన అక్కడ గుండెపోటుతో హఠాన్మరణం చెందినట్లు సమాచారం
పలువురు ప్రముఖులు సంతాపం
2012లో మూర్తి, ఆశిష్‌తో కలిసి పెప్పర్ ఫ్రై ను స్థాపించారు. దీని కంటే ముందు అంబరీష్ ఈబే లో భారత్, ఫిలిప్పీన్స్, మలేషియా దేశఆల మేనేజర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు లెవీ స్ట్రాస్, బ్రిటానియా, పీ అండ్ ఎల్ వంటి సంస్థల్లో పనిచేశారు. దిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అంబరీష్ మరణ వార్త విషయాన్ని తెలుసుకున్న పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు సోషల్ మీడియా ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు