IMF- AI: 'ఏఐ' ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా 40శాతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం: ఐఎంఎఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ప్రపంచవ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్( ఐఎంఎఫ్- IMF) చీఫ్ క్రిస్టాలినా జార్జివా సంచలన కామెంట్స్ చేశారు. AI కారణంగా ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఏఐ సాంకేతికత మానవ ఉద్యోగాలకు ముప్పు కలిగిస్తోందని క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40శాతం ఉద్యోగాలను కోల్పోవడం జరుగుతుందన్నారు. ఉత్పాదకతను పెంచడానికి కంపెనీలు ఈ కొత్త టెక్నాలజీని ఎంపిక చేసుకుంటున్నట్లు వివరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వార్షిక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు బయలుదేరే ముందు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టాలినా జార్జివా.. ఏఐ గురించి మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో 60శాతం ఉద్యోగాలపై AI ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలపై తక్కువ ప్రభావం: ఐఎంఎఫ్
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏఐ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పెరిగేకొద్దీ ఈ ప్రభావం పెరుగుతుందని ఆమె చెప్పారు. అయితే అన్ని ఉద్యోగాలపై AI ప్రతికూల ప్రభావాన్ని చూపదన్నారు. కొన్ని ఉద్యోగాలపై AI సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. ఏఐ అనేది ఉద్యోగి పనిని సులభతరం చేయగలదని ఐఎంఎఫ్ చీఫ్ అభిప్రాయపడ్డారు. ఏఐ సాయంతో ఉత్పాదకత పెరుగుతుందని, తద్వారా ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఆ దేశాల్లోని కార్మికులు అతి తక్కువ ఏఐ ప్రభావాన్ని కలిగి ఉంటారని క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు.