Anand Mahindra: 'ఏఐ' కన్నా.. పెద్ద సంక్షోభం పొంచి ఉంది : ఆనంద్ మహీంద్రా
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సు (AI) ఉద్యోగాలను ప్రమాదంలో పడేసిందనే చర్చలు జరుగుతున్న సమయంలో, పరిశ్రమల దిగ్గజం ఆనంద్ మహీంద్ర కీలక వ్యాఖ్య చేశారు. చాలా మంది వైట్-కాలర్ ఉద్యోగాలు ఏఐ వల్ల తొలగిపోతాయని భయపడుతున్నప్పటికీ, అసలు దృష్టిపెట్టాల్సిన మరింత గంభీరమైన సమస్యను మనం విస్మరిస్తున్నామని ఆయన చెప్పారు. అదే.. నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత.
వివరాలు
చాలా ఉద్యోగాలకు సంవత్సరానికి దాదాపు 1 కోటి రూపాయలకు పైగా జీతం
ఆటోమొబైల్ సంస్థ 'ఫోర్డ్' సీఈవో జిమ్ ఫార్లే పాడ్‌కాస్ట్‌ను ఉటంకిస్తూ ఆయన ఈమేరకు పోస్టు చేశారు. "ఫోర్డ్ సీఈవో ఇటీవల తన పాడ్‌కాస్ట్‌లో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. వారి కంపెనీలోనే 5,000 మెకానిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. వీటిలో చాలా ఉద్యోగాలకు సంవత్సరానికి దాదాపు 1 కోటి రూపాయల (1,20,000 డాలర్లు)కు పైగా జీతం లభిస్తుంది.అయినా కూడా ఈ పోస్టులు నిండట్లేదట. అమెరికా మొత్తం మీదే చూస్తే ప్లంబింగ్, ఎలక్ట్రికల్,ట్రక్కింగ్,తయారీ రంగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఇవి భవిష్యత్ అంచనాలు కాదు...ప్రస్తుత జరుగుతున్నదే. సంవత్సరాలుగా మనం డిగ్రీలు,ఆఫీసు డెస్క్ ఉద్యోగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రావడం వల్ల,వృత్తిపర నైపుణ్యాలు నేర్చుకున్న శ్రామికులను పెద్దగా పట్టించుకోలేదని మహీంద్రా సూచించారు.
వివరాలు
నైపుణ్యశాలి కార్మికులే ఏఐ యుగంలో నిజమైన విజేతలు
ఈ రకమైన పనులను ఏఐ భర్తీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు తీర్మానశక్తి, చేతి పనితనం, అనుభవంతో వచ్చే నైపుణ్యం, ప్రత్యేక శిక్షణలు అవసరం. మన సమాజంలో 'కలల కెరీర్‌గా' భావించే దానిపై ఇక మార్పులు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ధోరణి కొనసాగితే, ప్రపంచాన్ని నిర్మించగలిగిన,దిద్దగలిగిన,నడిపించగలిగిన నైపుణ్యశాలి కార్మికులే ఏఐ యుగంలో నిజమైన విజేతలు అవుతారని పేర్కొన్నారు. కార్మికుల ఎదుగుదలను గురించి మాట్లాడిన కార్ల్ మార్క్స్ పోరాటం ద్వారా మార్పు వస్తుందని ఊహించినా, నైపుణ్య లోటు వల్ల శ్రామిక వర్గం ప్రాధాన్యం పెరుగుతుందని మాత్రం ఆయన ఊహించి ఉండకపోవచ్చని మహీంద్రా వ్యాఖ్యానించారు. హింసతో కాదు... శ్రామిక నైపుణ్యాలు తెచ్చిన కొత్త విప్లవం ఇదేనని ఆయన ట్వీట్‌లో రాశారు.