LOADING...
Anil Ambani: రూ.17వేల కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి ED సమన్లు జారీ 
రూ.17వేల కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి ED సమన్లు జారీ

Anil Ambani: రూ.17వేల కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి ED సమన్లు జారీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)నోటీసులు జారీ చేసింది. సుమారు రూ.17,000కోట్ల విలువైన బ్యాంకు రుణాలకు సంబంధించి జరిగిన మోసాల కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతుండగా,ఈ క్రమంలో ఆగస్టు 5న న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని ఆయనకు ఆదేశాలు జారీ అయ్యాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ నుంచి అధికారికంగా స్టేట్‌మెంట్‌ నమోదు చేయనున్నట్లు శుక్రవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి గత వారం మూడు రోజుల పాటు అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ముంబయిలో ఉన్న 35 ప్రదేశాల్లో దాదాపు 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన కార్యాలయాలపై సోదాలు జరిగాయి.

వివరాలు 

యెస్ బ్యాంక్‌ అనిల్ అంబానీ గ్రూప్‌ సంస్థలకు సుమారు రూ.3,000 కోట్ల రుణాలు 

ఈ తనిఖీల్లో దర్యాప్తు అధికారులు అనేక కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అనిల్ అంబానీకి తాజా సమన్లు జారీ చేశారు. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు భారీ మొత్తంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ కేసును నమోదు చేసింది. ముఖ్యంగా 2017 నుంచి 2019 మధ్యకాలంలో యెస్ బ్యాంక్‌ అనిల్ అంబానీ గ్రూప్‌ సంస్థలకు సుమారు రూ.3,000 కోట్ల రుణాలు మంజూరు చేసింది. అయితే అవి చట్టవ్యతిరేకంగా ఉపయోగించబడినట్లు ఆరోపణలు ఉన్నాయి.అంతేకాకుండా,యెస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చినట్టు కూడా ఆరోపణలు వెలుగు చూసాయి. అదనంగా,రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ తీసుకున్న రూ.10,000కోట్ల రుణాలను కూడా ఇతర ఉద్దేశాలకు మళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి.

వివరాలు 

ఆర్‌కామ్,కెనరా బ్యాంక్ మధ్య రూ.1,050 కోట్ల అనుమానాస్పదమైన లావాదేవీలు

ఇదే తరహాలో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్),కెనరా బ్యాంక్ మధ్య జరిగిన రూ.1,050 కోట్ల రుణ వ్యవహారంలోనూ తీవ్ర అనుమానాస్పదమైన లావాదేవీలు జరిగాయని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. అంతేకాక, బ్యాంకులు జారీ చేసే అడిషనల్ టైర్‌-1 (AT-1) బాండ్లలో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ సుమారు రూ.2,850 కోట్ల మేర పెట్టుబడులు పెట్టిన విషయం వెలుగు చూసింది. ఇందులో క్విడ్ ప్రోకో (ఉపకారం కోసం ప్రతిఫలం) జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా, అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు మొత్తం రూ.17వేల కోట్లకు పైగా రుణాల మోసాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలపై ఈడీ ఇప్పుడు లోతుగా విచారణ జరుపుతోంది.