Bank Strike on January 27: 5 రోజుల పని కోసం ఉద్యోగుల సమ్మె.. బ్యాంకులకు 4 రోజులు సేవలకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
చాలా కాలం గ్యాప్ తర్వాత బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. తమ పెండింగ్ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ 2026 జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) ప్రకటించింది. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఒక అధికారిక సర్క్యులర్‌ను కూడా విడుదల చేసింది.
వివరాలు
వేతన సవరణపై కూడా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు: AIBOC
ఐదు రోజుల పని విధానం అమలు చేయడమే కాకుండా, వేతన సవరణపై కూడా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని AIBOC స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్లు (UFBU) ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తోందని విమర్శించింది. ఈ నిర్లక్ష్య ధోరణికి నిరసనగానే సమ్మెకు పిలుపునిచ్చినట్లు పేర్కొంది. సమ్మె నేపథ్యంలో జనవరి 27న బ్యాంకింగ్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే, దాదాపు అన్ని రకాల సేవలు నిలిచిపోవచ్చని అంచనా.
వివరాలు
సమ్మె కారణంగా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడే పరిస్థితి
అయితే ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగవచ్చని సమాచారం. అయినప్పటికీ వినియోగదారులకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని చెబుతున్నారు. ఇక మరోవైపు, ఈ సమ్మె కారణంగా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడే పరిస్థితి ఏర్పడనుంది. జనవరి 24న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జనవరి 25 ఆదివారం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికే బ్యాంకులు పనిచేయవు. ఈ నేపథ్యంలో 27న కూడా సమ్మె జరిగితే, నాలుగు రోజులపాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుందని తెలుస్తోంది.
వివరాలు
ప్రతి శనివారం సెలవు ఇవ్వాలని డిమాండ్
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), జీఐసీ, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, మనీ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజీలు, ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు ఇప్పటికే వారానికి ఐదు రోజులే పని చేస్తున్నారని బ్యాంకర్లు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా తమకూ ప్రతి శనివారం సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆదివారాలతో పాటు ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవుగా ఉండగా, మిగతా శనివారాలు కూడా హాలిడే కావాలన్నదే ప్రధాన డిమాండ్ అని వెల్లడించారు. ఇప్పటికే 2024లో ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
ప్రపంచంలోని అనేక దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని విధానం
ప్రపంచంలోని అనేక దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని విధానం అమలులో ఉండగా, తాము కేవలం ఐదు రోజుల పని మాత్రమే కోరుతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేసినా, డిజిటల్ సేవలు మాత్రం 24x7 అందుబాటులో ఉంటాయని, తాము అదనపు సెలవులను విలాసంగా కోరడం లేదని, న్యాయమైన పని పరిస్థితుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం తమను పట్టించుకోకపోవడమేనని ఆరోపిస్తున్నారు. ఇకపై మరిన్ని వాయిదాలు వద్దని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించాల్సిందేనని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.