H1B visa: భారతీయులకు బైడెన్ శుభవార్త.. హెచ్-1బీ వీసాల నిబంధనలు మరింత సరళతరం
అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు జో బైడెన్ కార్యవర్గం ఒక శుభవార్త ఇచ్చింది. అమెరికా కంపెనీలకు ప్రత్యేక నిపుణులైన విదేశీయులను నియమించుకోవడం కోసం నిబంధనల్లో మార్పులు చేసి, తేలికగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. దీనివల్ల లక్షలాది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనాలు కలగనుంది. హెచ్-1బీ వీసా అనేది నాన్-ఇమిగ్రెంట్ కేటగిరీలో వస్తుంది,టెక్నాలజీ కంపెనీలు ఈ వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. భారత్, చైనా దేశాలు ఈ వీసా ద్వారా లబ్ధి పొందాయి. తాజాగా,డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా కొత్త నిబంధనలు ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం,సంస్థలు వారి అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేయడం ద్వారా ప్రపంచ పోటీ మార్కెట్లో స్థిరపడగలవు.
ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులు త్వరగా ప్రాసెస్
వచ్చే నెల ట్రంప్ ప్రమాణస్వీకారం జరగనున్న నేపథ్యంలో, బైడెన్ కార్యవర్గం ఈ మార్పులను అమలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం, ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులభంగా హెచ్-1బీ వీసాలుగా మార్చుకోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎఫ్-1 వీసాకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగించబడినట్లయింది. ఇక, గతంలోనే హెచ్-1బీ వీసా పొందిన వారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులు త్వరగా ప్రాసెస్ చేయబడతాయి. అమెరికాలోని వ్యాపార సంస్థలకు కార్మికుల అవసరాలను తీర్చేందుకు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2025 జనవరి 17 నుంచి అమలులోకి
ఈ విధానంతో సంస్థలపై పడుతున్న అనవసర ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చు. కొత్త విధానంలో, లేబర్ కండీషన్ అప్లికేషన్ హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. ఈ నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్నాయి. అమెరికాలో ప్రతి సంవత్సరం 65,000 హెచ్-1బీ వీసాలకు అనుమతి ఇచ్చే యోచన ఉంది, అదనంగా 20,000 అడ్వాన్స్ డిగ్రీ వీసాలను కూడా జారీ చేయనున్నారు. అయితే, కొన్ని నాన్-ప్రాఫిట్ సంస్థలకు ఈ మార్పులు వర్తించవు. కొత్త నిబంధనల ప్రకారం, ఈ సంస్థలు తమ పని ''పరిశోధన'' అని పేర్కొనాల్సి ఉంటుంది.
1990లో అమెరికా కాంగ్రెస్ హెచ్-1బీ వీసాల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో ఎన్ మేయోర్కాస్ పేర్కొన్నట్లు, ''ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకోవడం కోసం అమెరికా వ్యాపార సంస్థలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడుతున్నాయి. ఈ మార్పులతో, యజమానులకు ప్రతిభావంతులను నియమించుకోవడం మరింత సులభం అవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వాన్ని పెంచుతుంది. సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది'' అని తెలిపారు. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జడ్డూ కూడా స్పందిస్తూ, ''1990లో అమెరికా కాంగ్రెస్ హెచ్-1బీ వీసాల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాలానుగుణంగా, ఈ కార్యక్రమాన్ని ఆధునికీకరించడం అవసరం'' అని చెప్పారు.