July New Rules: బిగ్ అలర్ట్! జూలై 1 నుంచి అమల్లోకి 5 కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ నెల ముగియడానికి చేరువ కావడంతో జూలై 1 నుంచి పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆధార్ కార్డు ఈమెయిల్ అప్‌డేట్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు, సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలు, బ్యాంకు సెలవుల వరకు అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవి సామాన్యుల రోజువారీ జీవితం, ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది.
వివరాలు
1. ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్‌కు ఉచిత అవకాశం
UIDAI తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఆధార్ కార్డులో ఇప్పటివరకు ఈమెయిల్ ఐడిని నమోదు చేయని లేదా అప్‌డేట్ చేయని వారికి జూలై 1 నుంచి ఆరు నెలల పాటు ఉచితంగా ఈమెయిల్ అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఈ సౌకర్యం జూలై నుంచి డిసెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు ఈ సేవ కోసం రూ.75 రుసుము చెల్లించాల్సి ఉండగా, కొత్త నిర్ణయంతో ఆ భారం తప్పనుంది.
వివరాలు
2. ఎల్‌పీజీ గ్యాస్ ధరల్లో మార్పు ఉండొచ్చు
ప్రతి నెల మొదటి తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. జూన్ నెలలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.53.50 వరకు పెంచడంతో పాటు 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను కూడా పెంచాయి. ఇదే నేపథ్యంలో జూలై 1 నుంచి మరోసారి ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది ఆయిల్ కంపెనీల అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.
వివరాలు
3. ATF, CNG, PNG ధరలు కూడా మారే అవకాశం
జూలై ప్రారంభంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను కూడా సవరించే అవకాశముంది. గత నెలలో ఈ ఇంధనాల ధరలు పెరిగిన నేపథ్యంలో, ఈసారి ప్రకటించే కొత్త ధరలు రవాణా వ్యయంతో పాటు విమాన టికెట్ ఛార్జీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
వివరాలు
4. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దేశీయ విమానాశ్రయాల్లో ఉచిత లాంజ్ యాక్సెస్ పొందాలంటే గత మూడు నెలల్లో కనీసం రూ.60 వేల వరకు ఖర్చు చేసి ఉండాలి. ముఖ్యంగా ప్రయాణ ప్రయోజనాల కోసం ఈ కార్డును వినియోగించే కస్టమర్లపై ఈ నిబంధన ప్రభావం చూపనుంది.
వివరాలు
5. జూలైలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు
జూలై నెలలో పండుగలు, ప్రాంతీయ సెలవులు, వారాంతాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు సుమారు 12 రోజుల పాటు మూతపడనున్నాయి. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు అన్ని ఆదివారాలు కలిపి ఆరు వారాంతపు సెలవులు ఉన్నాయి. అదనంగా మిజోరం, మేఘాలయ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో స్థానిక పండుగల సందర్భంగా మరికొన్ని సెలవులు ఉండనున్నాయి. అందువల్ల ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉంటే ముందుగానే సెలవుల జాబితాను పరిశీలించి ప్లాన్ చేసుకోవడం మంచిది.
వివరాలు
ఏం చేయాలి?
జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త మార్పులపై ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరం. ఉచిత ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్ అవకాశాన్ని వినియోగించుకోండి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలను తెలుసుకుని అవసరమైన ఖర్చులను ప్లాన్ చేసుకోండి. అలాగే బ్యాంకు సెలవుల జాబితాను ముందుగానే చూసుకుని ముఖ్యమైన లావాదేవీలు, ఇతర పనులను సమయానికి పూర్తి చేసుకోవడం ఉత్తమం.