Gratuity rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్: 1 సంవత్సరంలోనే గ్రాట్యుటీ.. కానీ ఈ కండీషన్ గుర్తుంచుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి రావడంతో గ్రాట్యుటీ అర్హతలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు కనీసం 5 సంవత్సరాలు పనిచేస్తేనే గ్రాట్యుటీకి అర్హత ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం 1 సంవత్సరం పనిచేసినా గ్రాట్యుటీ పొందే అవకాశం కల్పించారు. ఈ మార్పు ఉద్యోగులకు లాభదాయకంగా కనిపించినప్పటికీ, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఈ కొత్త నిబంధనలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఆ తేదీ తర్వాత కంపెనీలో చేరిన ఉద్యోగులకు మాత్రమే ఈ ఒక సంవత్సరం అర్హత వర్తిస్తుంది. అంతకంటే ముందు నుండి పనిచేస్తున్న వారికి పాత నిబంధనలు కొనసాగుతాయి.
వివరాలు
ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం వేరే నిబంధనలు
అయితే ఈ ఒక సంవత్సరం గ్రాట్యుటీ నియమం ఉద్యోగులందరికీ వర్తించదు. ముఖ్యంగా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు (Fixed Term Employees) కాంట్రాక్ట్ వర్కర్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. శాశ్వత ఉద్యోగులకు మాత్రం సాధారణంగా 5 సంవత్సరాల సేవ పూర్తిచేయాల్సిందే. మరణం లేదా అంగవైకల్యం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం వేరే నిబంధనలు అమలవుతాయి. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు అంటే ఒక నిర్దిష్ట కాలానికి ఒప్పందంతో నియమించబడినవారు. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద పని చేసే వారు. వీరికి గ్రాట్యుటీని ప్రోరాటా పద్ధతిలో లెక్కిస్తారు. అంటే వారు పనిచేసిన కాలానికి అనుగుణంగా గ్రాట్యుటీ ఇస్తారు. 5 సంవత్సరాలు పూర్తికాకపోయినా, పని చేసిన వ్యవధి మేరకు వారికి గ్రాట్యుటీ లభిస్తుంది.
వివరాలు
గ్రాట్యుటీ మొత్తంలో పెరుగుదల
కొత్త నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ లెక్కించేటప్పుడు బేసిక్ పే,డియర్నెస్ అలవెన్స్ (DA),రిటైనింగ్ అలవెన్స్ మొత్తం కలిపి జీతంలో కనీసం 50% ఉండాలి. దీనివల్ల గ్రాట్యుటీ మొత్తంలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు చాలా కంపెనీల్లో బేసిక్ పే మొత్తం జీతంలో 30% మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు అది 50%గా ఉండాల్సి రావడంతో గ్రాట్యుటీ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపించవచ్చు. నిపుణుల ప్రకారం ఈ మార్పుతో గ్రాట్యుటీ చెల్లింపులు సుమారు 66% వరకు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా అలవెన్సులు మొత్తం జీతంలో 50% కంటే ఎక్కువైతే, అదనపు భాగాన్ని ఆటోమేటిక్‌గా బేసిక్ పేలో కలిపి లెక్కిస్తారు. దీని వల్ల కూడా ఉద్యోగులకు చివరికి వచ్చే గ్రాట్యుటీ మొత్తం మరింత పెరుగుతుంది.